Websol Renewable: నాయుడుపేటలో ₹3,538 కోట్ల పెట్టుబడితో 8 గిగావాట్ల ఇంటిగ్రేటెడ్ సోలార్ యూనిట్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సౌరశక్తి ఉత్పత్తి రంగంలో తన స్థానాన్ని మరింత బలపరుస్తోంది. తిరుపతి జిల్లా, నాయుడుపేటలోని ఎంపీసెజ్ (MPSEZ) ప్రాంతంలో వెబ్‌సోల్ రెన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్ భారీ సోలార్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ₹3,538 కోట్ల పెట్టుబడితో, 8 గిగావాట్ల సామర్థ్యం (4 గిగావాట్ల సోలార్ సెల్స్, 4 గిగావాట్ల సోలార్ మాడ్యూల్స్) కలిగిన పూర్తి ఇంటిగ్రేటెడ్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 2,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
వివరాలు
100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సొంత సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్న వెబ్‌సోల్
ప్రాజెక్ట్ 120 ఎకరాల భూస్థలంలో రెండు దశల్లో అభివృద్ధి చేయబడనుంది. 2027 జులైలో మొదటి దశ, 2028 జులైలో రెండో దశ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం కానుంది. కేంద్రానికి అవసరమైన విద్యుత్‌ను పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా 300 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో భాగంగా, వెబ్‌సోల్ 100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సొంత సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ పెట్టుబడితో నాయుడుపేట, సమీప దక్షిణ తమిళనాడు పారిశ్రామిక కారిడార్, దేశంలో ప్రముఖ సోలార్ తయారీ కేంద్రంగా మారుతోంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో ప్రీమియర్ ఎనర్జీస్, టాటా పవర్, వోల్ట్‌సన్ వంటి పెద్ద కంపెనీలు తమ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేశారు.
వివరాలు
ఏపీ పారిశ్రామిక విధానం పెట్టుబడులకు అత్యంత అనుకూలమని పరిశ్రమ వర్గాల ప్రశంస
దీంతో సరఫరాదారులు, లాజిస్టిక్స్, నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, పోర్ట్ కనెక్టివిటీ వంటి అంశాలతో ఒక శక్తివంతమైన పారిశ్రామిక వాతావరణం ఏర్పడుతోంది. వెబ్‌సోల్ ఎనర్జీ సిస్టమ్ లిమిటెడ్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ సోహన్ లాల్ అగర్వాల్ మాట్లాడుతూ, "భారత పునరుత్పాదక ఇంధన లక్ష్యాలు, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో ముందుగా సాగుతున్న సందర్భంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మా విస్తరణ ప్రణాళికలకు ఇచ్చిన ఆమోదం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇక్కడి అనుకూల పారిశ్రామిక వాతావరణం మా 8 గిగావాట్ల ప్రాజెక్ట్ విజయవంతం కావడానికి బలమైన వేదికను అందిస్తుంది," అన్నారు.
వివరాలు
నాయుడుపేట భారత పునరుత్పాదక ఇంధన పారిశ్రామిక కేంద్రంగా ఎదుగుతోంది
రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ పెట్టుబడిని స్వాగతిస్తూ, "వెబ్‌సోల్ ₹3,500 కోట్ల పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్‌ను క్లీన్-ఎనర్జీ తయారీకి అత్యంత పోటీభరిత ప్రాంతంగా నిలబెడుతోంది. వేగవంతమైన భూకేటాయింపులు, సింగిల్-డెస్క్ అనుమతులు, నమ్మకమైన విద్యుత్ సరఫరా వంటి సౌకర్యాలతో, నాయుడుపేట భారత పునరుత్పాదక ఇంధన పారిశ్రామిక కేంద్రంగా ఎదుగుతోంది," అన్నారు.