పశ్చిమ బెంగాల్: పిడుగుపాటుకు 14మంది బలి
పశ్చిమ బెంగాల్‌లోని ఐదు జిల్లాల్లో పిడుగులు పడి దాదాపు 14 మంది మరణించారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో గురువారం ఓ మోస్తరు వర్షాలు కురిసిన నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడినట్లు అధికారులు చెప్పారు. పిడుగుపాటుకు పుర్బా బర్ధమాన్ జిల్లాలో నలుగురు, ముర్షిదాబాద్, నార్త్ 24 పరగణాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందినట్లు విపత్తు నిర్వహణ శాఖ అధికారి తెలిపారు. పశ్చిమ్ మిడ్నాపూర్‌లో ముగ్గురు, హౌరా రూరల్ జిల్లాల్లో మరో ముగ్గురు పిడుగుపాటుకు బలైనట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు.
మృతుల్లో రైతులే ఎక్కువ
పిడుగుపాటుకు బలైనవారిలో రైతులే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. పొలాల్లో పని చేస్తున్న సమయంలో పిడుగుపాటుకు గురైనట్లు పేర్కొన్నారు. కోల్‌కతా, హౌరా, నార్త్ 24 పరగణాలు, పుర్బా బర్ధమాన్, ముర్షిదాబాద్ సహా పలు దక్షిణ బెంగాల్ జిల్లాల్లో గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ, ఉత్తర ప్రాంతాలలో శుక్రవారం కూడా వర్షపాతం కొనసాగుతుందని అలీపూర్ వాతావరణ శాఖ అంచనా వేసింది.