'ఇండియా' లేక 'భారత్'? రాజ్యాంగం ఏం చెబుతోంది?
భారత రాష్ట్రపతి నుండి G20 విందుకి సంబందించి అందిన ఆహ్వాన పత్రికలో దేశం పేరును'ఇండియా'నుండి 'భారత్'గా అధికారికంగా మార్చడంపై రాజకీయ దుమారం రేగింది. ఆహ్వాన పత్రికలో ద్రౌపది ముర్ముని'ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా' అని కాకుండా 'భారత్ ప్రెసిడెంట్' అని ఉండడంతో,దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల నాయకులు ఈ విషయమై అనేక ప్రశ్నలను లేవనెత్తారు. కాబట్టి, దీని గురించి రాజ్యాంగం, సుప్రీంకోర్టు ఏమి చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 "భారతదేశం, అంటే భారత్, రాష్ట్రాల యూనియన్‌గా ఉండాలి" అని పేర్కొంది. రాజ్యాంగం గుర్తించిన 'ఇండియా', 'భారత్' పదాలు రెండూ దేశానికి అధికారిక పేర్లేనని చెప్పేందుకు ఆర్టికల్ 1ని బట్టి చెప్పొచ్చు.
ఇండియా'ను తొలగించి 'భారత్' అనే ఏకైక అధికారిక పేరుగా రాజ్యాంగాన్ని సవరించాలని కేంద్రం యోచిస్తోందా?
మార్చి 2016లో 'ఇండియా' నుండి 'భారత్'గా పేరు మార్చాలని కోరుతూ దాఖలైన ఒక PIL (ప్రజా ప్రయోజన వ్యాజ్యం)ను సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ కొట్టివేసింది. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ యూయూ లలిత్‌లతో కూడిన ధర్మాసనం అలాంటి పిటిషన్లను విచారించబోమని పిటిషనర్‌కు తెలిపింది. ఇండియా లేదా భారతదేశమా? మీరు దేనిని భారత్ అని పిలవాలనుకుంటున్నారో,అలా ముందుకుసాగండి.ఎవరైతే ఇండియా అని పిలవాలనుకుంటున్నారో, వారిని ఇండియా అని పిలవనివ్వండి" అని జస్టిస్ ఠాకూర్ ఆ సమయంలో అన్నారు.
ఇదే విధమైన అభ్యర్థనను స్వీకరించడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు
నాలుగు సంవత్సరాల తరువాత, 2020లో, భారతదేశం నుండి ఇండియాగా పేరు మార్చాలని కోరుతూ ఇదే విధమైన అభ్యర్థనను స్వీకరించడానికి సుప్రీంకోర్టు మరోసారి నిరాకరించింది. పిటిషన్‌ను అభ్యర్థనగా మార్చుకుని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చెయ్యచ్చని కూడా సూచించింది.ఇండియా,భారతదేశం రెండూ రాజ్యాంగంలో ఇవ్వబడిన పేర్లు. భారతదేశాన్ని ఇప్పటికే రాజ్యాంగంలో 'ఇండియా' అని పిలుస్తారని భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎ బాబ్డే అన్నారు.
రాజ్యాంగాన్ని ఎలా సవరించవచ్చు?
ఒకవేళ ప్రభుత్వం 'భారత్' అనే పేరును మాత్రమే అధికారికంగా మార్చాలని నిర్ణయించుకుంటే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 1ని సవరించడానికి బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఆర్టికల్ 368 సాధారణ మెజారిటీ సవరణ లేదా ప్రత్యేక మెజారిటీ సవరణ ద్వారా రాజ్యాంగాన్ని సవరించడానికి అనుమతిస్తుంది. కొత్త రాష్ట్ర ఏర్పాటు లేదా రాజ్యసభలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సీట్ల కేటాయింపు వంటి రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్స్ సవరణలకు,హాజరైన మొత్తం సభ్యుల సంఖ్యలో సాధారణ మెజారిటీ (అంటే 50 శాతం కంటే ఎక్కువ) అయితేమార్చుకోవచ్చు. ఆర్టికల్ 1 వంటి ప్రత్యేక సవరణ కోసం సభకు హాజరైన లేదా ఓటు వేసిన సభ్యులలో మూడింట రెండు వంతుల కంటే తక్కువ కాకుండా ప్రత్యేక మెజారిటీ (66 శాతం)అవసరం.