
జీ20 సమ్మిట్ వేళ.. తెరిచి ఉండేవి ఏవి? మూసి ఉండేవి ఏవో తెలుసుకుందాం
ఈ వార్తాకథనం ఏంటి
సెప్టెంబర్ 9,10 తేదీల్లో దిల్లీలో ప్రతిష్ఠాత్మక జీ20 సదస్సు కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వబోతోంది.
ప్రగతి మైదాన్‌లో కొత్తగా నిర్మించిన భారత్ మండపం కన్వెన్షన్ సెంటర్‌లో సమ్మిట్ జరగనుంది.
జీ20కూటమిలోని దేశాధినేతలు సెప్టెంబర్ 8 నుంచే దిల్లీకి చేరుకోవడం ప్రారంభిస్తారు.
దీంతో ఆరోజు నుంచే ఎలాంటి ఆటంకాలు కలగకుండా, వాతావరణం ప్రశాంతంగా ఉండేందుకు కేంద్రం అఫీసులు, పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించింది.
అలాగే ట్రాఫిక్ ఆంక్షలను కూడా విధించనున్నారు. ఈ ఆంక్షలు సెప్టెంబర్ 8 నుంచే 10వ తేదీ వరకు అమలు కానున్నాయి.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సెలవులకు సంబంధించిన ఉత్తర్వులను కూడా విడుదల చేసింది.
దిల్లీ
ఏం తెరిచి ఉంటాయంటే?
జీ20 సమ్మిట్ నేపథ్యంలో దిల్లీలో 8,9,10 తేదీల్లో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, అన్ని స్కూల్స్, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ఇప్పటికే కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
సాఫ్ట్ వేర్ ఉద్యోగులు అవసరమైతే వర్క్ ఫ్రమ్ హోం చేసుకోవచ్చు. అలాగే విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించుకోవచ్చు.
దిల్లీ పోలీస్ డిస్ట్రిక్ట్ పరిధిలో ఉన్న అన్ని వాణిజ్య బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మూడు రోజులు మూసివేస్తారు.
దిల్లీ మెట్రో సేవలు పాక్షికంగా కొనసాగుతాయి. సుప్రీంకోర్టు, ఖాన్ మార్కెట్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రోస్టేషన్లను మూడు రోజుల పాటు మూసివేయనున్నారు.
ఆసుపత్రులు, మెడికల్ స్టోర్లు, మిల్క్ బూత్‌లతో సహా కొన్ని అత్యవసర సేవలు తెరిచి ఉంటాయని అధికారులు చెప్పారు.
దిల్లీ
ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
ట్రాఫిక్ పోలీసులు కార్గో ట్రక్కులను మూడు రోజుల పాటు దిల్లీ రాకుండా నిషేదం విధించారు. ముఖ్యమైన సరుకును తీసుకువెళ్లే వాహనాలకు మాత్రమే దిల్లీలో ప్రవేశించడానికి అనుమతి ఉంటుంది.
దిల్లీలో కొన్ని ప్రాంతాల్లో నిర్దిష్ట సమయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించబడతాయి.
ట్రాఫిక్ జామ్‌లను నివారించడానికి, వీవీఐపీల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ఆంక్షలను విధించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను త్వరలో జారీ చేయనున్నారు.
కొన్ని ప్రాంతాల్లోని షాపింగ్ మాల్స్, మార్కెట్లు కూడా మూసివేయబడతాయి.
వీవీఐపీ కదలికలు ఉన్న ప్రాంతాల్లో బస్సుల రాకపోకలను నిషేధిస్తారు.
ఆసుపత్రి, అత్యవసర సేవలతో పాటు రైలు, విమానాల్లో ప్రయాణించే వారిపై ఎలాంటి ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.