Supreme Court: మూడేళ్లుగా ఏం చేస్తున్నారు? తమిళనాడు గవర్నర్‌పై సుప్రీంకోర్టు అసహనం
తమిళనాడు అసెంబ్లీ తీర్మానించిన బిల్లులను ఆమోందించకపోడవడంపై గవర్నర్ ఆర్‌ఎన్ రవిపై సుప్రీంకోర్టు సోమవారం అసహనం వ్యక్తం చేసింది. మూడేళ్లుగా బిల్లులను ఆమోదించకుండా ఏ చేస్తున్నారని గవర్నర్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. గవర్నర్లు బిల్లులను ఆమోదించడం లేదంటూ తమిళనాడు, పంజాబ్, కేరళ ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది. అసెంబ్లీ తీర్మానించిన బిల్లులను 2020 నుంచి ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయని, 3 సంవత్సరాలుగా ఏం చేస్తున్నారని తమిళనాడు గవర్నర్‌ను ధర్మాసనం అడిగింది. గవర్నర్ వద్ద 12 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని స్టాలిన్ ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది.
కేరళ గవర్నర్, కేంద్రానికి నోటీసులు
అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు కేరళ గవర్నర్ ఆమోదం తెలపని కేసులో.. కేంద్రానికి, గవర్నర్ కార్యాలయానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణలో నివేదికలతో కోర్టుకు హాజరుకావాలని అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్‌లను సీజేఐ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ఆదేశించింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ప్రభుత్వం ఆమోదించిన ముఖ్యమైన బిల్లులను గవర్నర్ అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని కేరళ సర్కారు తరఫు సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ వాదించారు. బిల్లులను ఎక్కువ కాలం పెండింగ్‌లో ఉంచడం అంటే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ని ఉల్లంఘించడమేనని ఆయన ధర్మాసనానికి వివరించారు.