Andhrapradesh: వాట్సప్ గవర్నెన్స్‌కు శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం.. వాట్సప్ ద్వారా పౌరసేవలు
దేశంలోనే తొలిసారిగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సేవలను అందించేందుకు, ప్రజల నుంచి వినతులను స్వీకరించేందుకు,వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వాట్సప్ గవర్నెన్స్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్రణాళికలో భాగంగా, ప్రభుత్వం త్వరలో అధికారిక వాట్సప్ నంబర్‌ను ప్రకటించనుంది, ఆ ఎకౌంట్‌కు వెరిఫైడ్ ట్యాగ్ (టిక్ మార్క్) కూడా ఉంటుంది. ఈ నంబరు వన్‌స్టాప్ సెంటర్‌గా పనిచేస్తూ, తొలిదశలో 153 రకాల సేవలను అందిస్తుంది. భవిష్యత్తులో ఈ సేవలను మరింత విస్తృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కలెక్టర్ల సదస్సు సందర్భంగా ఆర్‌టీజీఎస్ సీఈఓ దినేష్‌కుమార్ ఈ సేవలపై సమగ్ర ప్రజంటేషన్‌ను సమర్పించారు.
ప్రాంతీయ అభివృద్ధి పనుల గురించి వివరాలు
ప్రభుత్వ సమాచారాన్ని WhatsApp ద్వారా ప్రజలకు చేరవేత, వినతుల స్వీకరణ, పథకాల వివరాలు, పర్యాటక ప్రాంతాల సమాచారం, బిల్లులు, పన్నుల చెల్లింపులు వంటి సేవలను అందించడంపై చర్చ జరగింది. అందులో ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి: ప్రభుత్వ సమాచార పంపిణీ: ప్రభుత్వం కీలక సమాచారం, హెచ్చరికలు లేదా ప్రకటనలను ప్రజలకు చేరవేయడానికి WhatsApp ఖాతాను ఉపయోగిస్తుంది. ఉదాహరణకు, భారీవర్షాల కారణంగా సెలవులు ప్రకటించడం, విద్యుత్తు సరఫరాలో ఆటంకాల సమాచారాన్ని చేరవేయడం, వైరస్‌ల నివారణ చర్యలు సూచించడం, పిడుగుల ప్రమాదం వంటి హెచ్చరికలు అందించడం, లేదా ప్రాంతీయ అభివృద్ధి పనుల గురించి వివరాలను ప్రకటించడం వంటి సమాచారాన్ని వేలాది మందికి ఒకేసారి పంపవచ్చు.
వినతుల స్వీకరణ, పరిష్కారం:
ప్రజలు తమ ఫిర్యాదులు లేదా వినతులను సులభంగా WhatsApp నంబరుకు పంపవచ్చు. మెసేజ్ పంపిన వెంటనే వారికి ఒక లింక్ అందుతుంది, అందులో వివరాలను పూరించగలరు. ఫిర్యాదు పంపిన తర్వాత ఒక రిఫరెన్స్ నంబర్ పొందవచ్చు, దాని ఆధారంగా పరిష్కారం ఎలా కొనసాగుతోంది అనేది ట్రాక్ చేయవచ్చు. మురుగు కాల్వల లీకేజీలు, రోడ్ల గుంతలు వంటి సమస్యల ఫోటోలను జతచేయడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ప్రభుత్వ పథకాల సమాచారం: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు, అర్హతలు తెలుసుకోవడానికి WhatsApp నంబర్ ఉపయోగపడుతుంది.
పర్యాటక ప్రదేశాల సమాచారం:
రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల వివరాలను WhatsApp ద్వారా అందిస్తారు. పర్యాటకులు తమకు అవసరమైన ప్రదేశాలను ఎంచుకుని, టిక్కెట్లు, వసతి సహా అన్ని సేవలను బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. విద్యుత్తు బిల్లులు, పన్నుల చెల్లింపులు: విద్యుత్తు బిల్లులు, ఆస్తి పన్నులు వంటి లావాదేవీలను WhatsApp ద్వారా సులభంగా చెల్లించవచ్చు. ట్రేడ్ లైసెన్సులు పొందడం, దేవాలయ దర్శనాల స్లాట్ బుకింగ్, వసతి బుకింగ్, విరాళాల పంపడం వంటి పనులు కూడా చేయవచ్చు. రెవెన్యూ శాఖకు సంబంధించిన ల్యాండ్ రికార్డులు, సర్టిఫికెట్లు పొందడంలో ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది.
చట్టబద్ధతపై ప్రధాన మంత్రి సూచనలు:
WhatsApp ద్వారా అందజేస్తున్న పత్రాలకు చట్టబద్ధత ఉండాలని, అందించే పౌరసేవలపై ఎనలిటిక్స్ నివేదికలను సకాలంలో సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ విధంగా, WhatsApp సేవలు ప్రజలకు సులభతరంగా సమాచారాన్ని చేరవేయడంలో, వినతుల పరిష్కారంలో, వివిధ సేవల లభ్యతను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.