LOADING...
Andhra Pradesh: ఏపీలో చౌక ధరకే గోధుమ పిండి… రేషన్ షాపుల్లో రూ.20కే కిలో పంపిణీ ప్రారంభం
ఏపీలో చౌక ధరకే గోధుమ పిండి… రేషన్ షాపుల్లో రూ.20కే కిలో పంపిణీ ప్రారంభం

Andhra Pradesh: ఏపీలో చౌక ధరకే గోధుమ పిండి… రేషన్ షాపుల్లో రూ.20కే కిలో పంపిణీ ప్రారంభం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 02, 2026
02:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొత్త సంవత్సరం కానుకగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుదారులకు కిలో గోధుమ పిండిని కేవలం రూ.20కే అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ జనవరి 1 నుంచి ప్రారంభించింది. ప్రస్తుతం ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద పట్టణ ప్రాంతాల్లో అమలు చేస్తుండగా, ప్రతి నెలా ఒక్కో రేషన్ కార్డుకు ఒక కిలో గోధుమ పిండి పంపిణీ చేయనున్నారు.

Details

 బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే భారీ తగ్గింపు

బహిరంగ మార్కెట్‌లో ప్రస్తుతం కిలో గోధుమ పిండి ధర రూ.60 నుంచి రూ.65 వరకు ఉండగా, ప్రభుత్వం చౌక ధర దుకాణాల ద్వారా కేవలం రూ.20కే అందిస్తోంది. ముందుగా పట్టణ ప్రాంతాల్లో ఈ పథకాన్ని అమలు చేసి, అక్కడ ఫలితాలు అనుకూలంగా ఉంటే గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించనున్నారు. ఇప్పటికే రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు రాగులు, జొన్నలు వంటి పోషక ధాన్యాలు అందుతుండగా, తాజాగా గోధుమ పిండిని కూడా జాబితాలో చేర్చారు.

Details

పోషకాహారమే లక్ష్యం

ప్రతి కుటుంబానికి సమతుల్యమైన పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. సహజంగా చెక్కి తయారు చేసిన నాణ్యమైన గోధుమ పిండిని, నాణ్యత తనిఖీలు పూర్తయ్యాక సురక్షిత ప్యాకింగ్‌తో పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని ప్రథమ ప్రాధాన్యంగా తీసుకుని చేపట్టిన ఈ సదుపాయాన్ని రేషన్ కార్డుదారులందరూ పూర్తిగా వినియోగించుకోవాలని కోరారు.

Advertisement

Details

ఈ-కేవైసీ తప్పనిసరి

ఇదిలా ఉండగా రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డులు పొందినప్పటికీ ఇంకా చాలామంది లబ్ధిదారులు ఈ-కేవైసీ పూర్తి చేయలేదు. ఈ ప్రక్రియ చేయించుకోకపోతే రేషన్ కార్డులు రద్దయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. వేలిముద్ర ద్వారా లబ్ధిదారుని ధ్రువీకరించే విధానమే ఈ-కేవైసీ. దీని ద్వారా నకిలీ రేషన్ కార్డులను పూర్తిగా తొలగించవచ్చని, సరుకుల పంపిణీ మరింత పారదర్శకంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. నిజమైన లబ్ధిదారులకు మాత్రమే లబ్ధి చేకూరేలా ఈ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు.

Advertisement

Details

ఎక్కడ, ఎలా ఈ-కేవైసీ?

లబ్ధిదారులు తమ రేషన్ డీలర్ షాప్‌లో, అలాగే గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో ఈ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. E-PoS (ఈ పోస్) యంత్రంలో వేలిముద్ర నమోదు చేయగానే ఈ-కేవైసీ పూర్తవుతుంది. ఇంకా రేషన్ కార్డు తీసుకోని వారు ఆయా రేషన్ దుకాణాల్లో కార్డును పొందవచ్చని అధికారులు తెలిపారు. నిర్లక్ష్యం వద్దు ఈ-కేవైసీ చేయించుకోకపోవడం లేదా మూడు నెలల పాటు రేషన్ తీసుకోకుండా ఉండడం వంటి అంశాల్లో నిర్లక్ష్యం చేస్తే రేషన్ కార్డు రద్దయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు. అందువల్ల లబ్ధిదారులు అప్రమత్తంగా ఉండి, సమయానికి ఈ-కేవైసీ పూర్తి చేసుకుని రేషన్ సరుకులు పొందాలని అధికారులు సూచిస్తున్నారు.

Advertisement