Professor GN Saibaba: మావోయిస్టులతో సంబంధాల కేసులో ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి: బాంబే హైకోర్టు
మావోయిస్టు సంబంధాల కేసులో దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ మంగళవారం నిర్దోషులుగా ప్రకటించింది. గడ్చిరోలి సెషన్స్ కోర్టు 2017లో అతడిని దోషిగా నిర్ధారించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సాయిబాబా హైకోర్టును ఆశ్రయించారు. నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యాలను సేకరించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని న్యాయమూర్తులు వినయ్ జోషి, వాల్మీకి ఎస్‌ఏ మెనెజెస్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. నిందితులపై నేరారోపణలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు అభిప్రాయపడింది. ట్రయల్ కోర్టు తీర్పు చట్టం ప్రకారం సరైనది కాదని ధర్మాసనం వెల్లడించింది. అందుకే గడ్చిరోలి సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నట్లు ధర్మాసనం తీర్పు చెప్పింది.
నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో సాయిబాబా
హైకోర్టు తీర్పుతో నిందితులందరూ నిర్దోషులుగా విడుదలయ్యారు. 54 ఏళ్ల సాయిబాబా 99 శాతం వికలాంగుడు. ప్రస్తుతం ఆయన నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు. మావోయిస్టు లింక్ కేసులో సాయిబాబా, హేమ్ మిశ్రా, మహేష్ టిర్కీ, విజయ్ టిర్కీ, నారాయణ్ సాంగ్లికర్, ప్రశాంత్ రాహి, పాండు నరోటే (మరణించిన) బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ నిర్దోషులుగా ప్రకటించింది. అంతకుముందు, అక్టోబర్ 14, 2022 న, హైకోర్టు మరొక బెంచ్ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించింది. అయితే సుప్రీంకోర్టు ఆ ఉత్తర్వులను రద్దు చేసి, కేసును తాజాగా విచారణ కోసం హైకోర్టుకు పంపింది. ఆ తర్వాత మళ్లీ సాయిబాబా అప్పీల్‌ను కోర్టు విచారించింది. ఇప్పుడు మళ్లీ నిర్దోషిగా తీర్పు చెప్పింది.