Congress: రైతుబంధు నిధులను దారి మళ్లించకుండా చర్యలు తీసుకోండి: ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
పోలింగ్ తర్వాత 6,000 కోట్ల రైతుబంధు నిధులను తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు మళ్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు నిధుల చెల్లింపులను నిలిపివేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ అగ్రనేతలు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ వికాస్ రాజ్‌ను కలిసి మెమోరాండం సమర్పించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంకా అమలులో ఉందని కాంగ్రెస్ నేతలు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించకుండా చర్యలు తీసుకోవాలని నాయకులు అభ్యర్థించారు. రైతుబంధు కింద పంపిణీకి ఎన్నికల సంఘం నిధులను అనుమతించనందున.. ఆ సోమ్మును కేసీఆర్ ప్రభుత్వం తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు పంపిణీ చేయాలని చూస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
రాజీనామా చేసేందుకే 4న కేసీఆర్ క్యాబినెట్ మీటింగ్ పెట్టారు: ఉత్తమ్
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో వేలాది ఎకరాల భూములకు సంబంధించి భూముల పట్టా రికార్డులను మార్చేందుకు ధరణి పోర్టల్‌ను దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. గతంలో ఉన్న భూ రికార్డుల ప్రకారం ఇవి అసైన్డ్ భూములని పేర్కొంటూ, 'ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల బినామీలకు' బదలాయిస్తున్నారని చెప్పారు. సీఈవోను కలిసిన అనంతరం టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. విధివిధానాలు పాటించేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలని కోరారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రస్తుత ప్రభుత్వం తన అధికారాలను దుర్వినియోగం చేయడానికి అనుమతించరాదన్నారు. గవర్నర్‌కు రాజీనామా సమర్పించేందుకే కేసీఆర్ డిసెంబరు 4న మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఉత్తమ్ పేర్కొన్నారు.