'ఆమె చనిపోయింది'.. పాకిస్థాన్ ప్రియుడిని పెళ్లి చేసుకున్న అంజుపై ఆమె తండ్రి సంచలన వ్యాఖ్యలు
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌కు వెళ్లి మంగళవారం అక్కడ తన ఫేస్‌బుక్ స్నేహితుడిని వివాహం చేసుకున్న భారతీయ మహిళ అంజుపై ఆమె తండ్రి గయా ప్రసాద్ థామస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రసాద్ థామస్ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలోని బౌనా గ్రామంలో విలేకరులతో మాట్లాడారు. అంజు తమ ఇంటికి తిరిగి రావడం కంటే చనిపోవడం మంచిదన్నారు. ఆమె తమ దృష్టిలో చనిపోయినట్లు చెప్పాడు. ఆమె తన ఇద్దరు పిల్లల భవిష్యత్తును నాశనం చేసిందని థామస్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలా పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే, ముందుగా భర్తకు విడాకులు ఇచ్చి ఉండాల్సిందన్నారు. 34ఏళ్ల అంజు ప్రస్తుతం తన 29 ఏళ్ల పాకిస్థాన్ స్నేహితుడు నస్రుల్లా ఇంట్లో ఉంటోంది.
అంజు పాకిస్థాన్‌లోనే చనిపోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా: థామస్
అంజు ఇస్లాం మతంలోకి మారిందా? అని విలేకరులు అడిగినప్పుడు, దీనికి సంబంధించి తన వద్ద ఎటువంటి సమాచారం లేదని థామస్ సమాధానం చెప్పారు. అంజు పిల్లలను ఎవరు చూసుకుంటారు? ఆమెకు 13 ఏళ్ల అమ్మాయి, ఐదేళ్ల అబ్బాయి ఉన్నారన్నారని థామస్ పేర్కొన్నారు. అంజును తిరిగి తీసుకురావాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారా? అని అడిగిన ప్రశ్నకు, థామస్ అలాంటిదేమీ చేయనని చెప్పారు. అంజు పాకిస్థాన్‌లోనే చనిపోవాలని తాను దేవుడిని ప్రార్థిస్తున్నట్లు థామస్ అన్నారు. అంజు తనతో మాట్లాడటం లేదని, ఆమె తన తల్లితో మాత్రమే మాట్లాడిందని థామస్ చెప్పారు. ఆమెకు పాస్‌పోర్ట్, వీసా ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదని వివరించారు.