LOADING...
Vijay kumar: వీరప్పన్ ఎన్‌కౌంటర్‌లో కీలక పాత్ర.. మాజీ ఐపీఎస్ విజయ్‌కుమార్‌కు పద్మశ్రీ
వీరప్పన్ ఎన్‌కౌంటర్‌లో కీలక పాత్ర.. మాజీ ఐపీఎస్ విజయ్‌కుమార్‌కు పద్మశ్రీ

Vijay kumar: వీరప్పన్ ఎన్‌కౌంటర్‌లో కీలక పాత్ర.. మాజీ ఐపీఎస్ విజయ్‌కుమార్‌కు పద్మశ్రీ

వ్రాసిన వారు Moogati Shabari
May 22, 2026
10:18 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎస్పీజీ, సీఆర్పీఎఫ్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తి, ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ ఎన్‌కౌంటర్‌లో ప్రధాన పాత్ర పోషించిన మాజీ ఐపీఎస్ అధికారి కె విజయ్‌కుమార్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. మే 25న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. తమిళనాడు క్యాడర్‌కు చెందిన 1975 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన విజయ్‌కుమార్ తన సుదీర్ఘ సేవా కాలంలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు, అడవి యుద్ధ వ్యూహాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2012లో ఆయన పదవీ విరమణ చేశారు.

వివరాలు

అడవి ప్రాంతాల్లో వరుస ఆపరేషన్లతో సక్సెస్..

1952 సెప్టెంబర్ 15న జన్మించిన విజయ్‌కుమార్, పోలీసు సేవలో చేరకముందు సెయింట్ జోసెఫ్ కాలేజ్, మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్‌లలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. 1976లో ఆయన ఐఏఎస్‌కు కూడా ఎంపికయ్యారు. అయితే, పోలీసు సేవలపైనే ఆసక్తితో ఐపీఎస్‌ను ఎంచుకున్నారు. దాదాపు ఐదు దశాబ్దాల కెరీర్‌లో చెన్నై పోలీస్ కమిషనర్‌గా, సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా, కేంద్ర హోంశాఖలో వామపక్ష ఉగ్రవాదం, జమ్మూకాశ్మీర్ వ్యవహారాలపై సీనియర్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అడవి ప్రాంతాల్లో ఆపరేషన్లు నిర్వహించడంలో విజయ్‌కుమార్‌కు ప్రత్యేక నైపుణ్యం ఉంది. ఆయన సీఆర్పీఎఫ్ డీజీగా ఉన్న సమయంలో, 2011 నవంబర్‌లో పశ్చిమ బెంగాల్‌లో సీఆర్పీఎఫ్ కోబ్రా కమాండోలు మావోయిస్టు నేత కిషన్‌జీని హతమార్చారు.

వివరాలు

వీరప్పన్ కోసం కకూన్ ఆపరేషన్..

ఎర్రచందన స్మగ్లర్ వీరప్పన్‌ను ఎన్‌కౌంటర్ చేసిన తమిళనాడు పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్‌కు కూడా విజయ్‌కుమార్ నేతృత్వం వహించారు. 'కకూన్ ఆపరేషన్' పేరుతో జరిగిన ఈ ఆపరేషన్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఆపరేషన్ అనుభవాలపై ఆయన ఒక పుస్తకాన్ని కూడా రచించారు. విజయ్‌కుమార్‌ను చాలా మంది "సూపర్ కాప్" అని కూడా పిలుస్తుంటారు. వీవీఐపీ భద్రత కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG)లో కూడా ఆయన సేవలందించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ భద్రత బాధ్యతల్లో పనిచేశారు. ఆ తర్వాత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కోసం స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ (SSG)ను ఏర్పాటు చేసి దానికి నాయకత్వం వహించారు. జమ్మూకాశ్మీర్ గవర్నర్ సలహాదారుగా కూడా సేవలందించారు.

Advertisement

వివరాలు

విజయ్ కుమార్‌కు అవార్డు ఇవ్వనున్న ద్రౌపది ముర్ము..

74 ఏళ్ల విజయ్‌కుమార్ ఈ ఏడాది పద్మశ్రీ అవార్డు అందుకోనున్న 113 మంది ప్రముఖుల్లో ఒకరు. ఈసారి పద్మ పురస్కారాల కోసం దేశంలోని 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 84 జిల్లాల నుంచి వ్యక్తులను ఎంపిక చేశారు. 'పీపుల్స్ పద్మ' #peoplespadma కార్యక్రమం కింద, పెద్ద నగరాల్లో పేరుప్రఖ్యాతులు పొందిన వారికంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కనబరుస్తున్నవారికి, సమాజం కోసం నిశ్శబ్దంగా సేవలందిస్తున్నవారికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. ఈసారి పద్మశ్రీతో పాటు 5 మందికి పద్మ విభూషణ్, మరో 13 మందికి పద్మ భూషణ్ పురస్కారాలు ప్రదానం చేయనున్నారు.

Advertisement