Loading...
Shehzad Bhatti: టిక్‌టాక్‌ నుంచి ఉగ్ర నెట్‌వర్క్‌ వరకు.. అమిత్‌ షా చెప్పిన షహజాద్‌ భట్టీ ఎవరు?
టిక్‌టాక్‌ నుంచి ఉగ్ర నెట్‌వర్క్‌ వరకు.. అమిత్‌ షా చెప్పిన షహజాద్‌ భట్టీ ఎవరు?

Shehzad Bhatti: టిక్‌టాక్‌ నుంచి ఉగ్ర నెట్‌వర్క్‌ వరకు.. అమిత్‌ షా చెప్పిన షహజాద్‌ భట్టీ ఎవరు?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 18, 2026
11:25 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్‌, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ షహజాద్‌ భట్టీ పేరు ప్రస్తుతం భారత్‌లో ఉగ్రవాద దర్యాప్తుల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. సోషల్‌ మీడియాను ఉపయోగించి యువతను ప్రభావితం చేయడం, భారత్‌లో తన నెట్‌వర్క్‌ను విస్తరించడం వంటి ఆరోపణలు అతడిపై ఉన్నాయి. తాజాగా స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు భట్టీ నెట్‌వర్క్‌పై భద్రతా సంస్థలు చేపట్టిన చర్యలను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రశంసించారు.

వివరాలు 

షహజాద్‌ భట్టీ ఎవరు?

పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌కు చెందిన షహజాద్‌ భట్టీ తొలుత దోపిడీలు, ఇతర నేరాలతో నేర ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు దర్యాప్తు సంస్థల వివరాలు చెబుతున్నాయి.

అనంతరం లాహోర్‌ అండర్‌వరల్డ్‌లో అతడి పేరు వినిపించింది. 2013లో అతడిపై పలు కేసులు నమోదయ్యాయి.

ఆ తర్వాత పాకిస్థాన్‌ నుంచి యూఏఈకి వెళ్లిన భట్టీ.. స్క్రాప్‌ సహా వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు ప్రచారం చేసుకున్నాడు.

పాకిస్థాన్‌లో టిక్‌టాక్‌ విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత భట్టీ సోషల్‌ మీడియా ద్వారా భారీగా గుర్తింపు పొందాడు.

మతపరమైన అంశాలు, జాతీయవాదం, వివాదాస్పద విషయాలపై పోస్టులు, వీడియోలు చేస్తూ పెద్ద సంఖ్యలో ఫాలోవర్లను సంపాదించుకున్నాడు.

సోషల్‌ మీడియా ప్రభావాన్ని ఉపయోగించుకుని తన పరిచయ వర్గాన్ని విస్తరించుకున్నట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.

వివరాలు 

'333' పేరుతో గుర్తింపు

సోషల్‌ మీడియాలో షహజాద్‌ భట్టీ '333' పేరుతోనూ గుర్తింపు పొందాడు.

భారత్‌లో జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ తనకు స్నేహితుడని అతడు గతంలో చెప్పుకునేవాడు.

అయితే 2025లో పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఈ ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు ప్రచారం జరిగింది.

పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా బిష్ణోయ్‌ చేసిన వ్యాఖ్యలు ఇందుకు కారణమని సమాచారం.

ADVERTISEMENT

వివరాలు 

జలంధర్‌ గ్రనేడ్‌ దాడి కేసులో కీలక ఆరోపణలు

భట్టీపై భారత దర్యాప్తు సంస్థలు చాలాకాలంగా నిఘా పెట్టాయి.

ప్రముఖ నటుడు, భాజపా నేత మిథున్‌ చక్రవర్తితోపాటు పలువురు ఇన్‌ఫ్లూయెన్సర్లను బెదిరించినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి.

అయితే జలంధర్‌లో యూట్యూబర్‌ రోజర్‌ సంధు ఇంటిపై జరిగిన దాడి కేసు తర్వాత అతడిపై దర్యాప్తు మరింత ముమ్మరమైంది.

2025 మార్చి 16న జలంధర్‌లోని రాయ్‌పూర్‌ రసూల్‌పూర్‌ గ్రామంలో రోజర్‌ సంధు ఇంటి బాల్కనీలో గ్రనేడ్‌ లాంటి వస్తువు పడింది.

ఈ ఘటనకు తానే బాధ్యుడినంటూ భట్టీ సోషల్‌ మీడియాలో వీడియో విడుదల చేశాడు.

తొలుత స్థానిక పోలీసులు దీనిని ఇద్దరు యూట్యూబర్ల మధ్య జరిగిన వివాదంగా పేర్కొన్నప్పటికీ, అనంతరం దర్యాప్తు ముందుకు సాగింది.

ADVERTISEMENT

వివరాలు 

జలంధర్‌ గ్రనేడ్‌ దాడి కేసులో కీలక ఆరోపణలు

ఈ కేసును 2025 డిసెంబరులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) చేపట్టింది.

2026 ఏప్రిల్‌లో భట్టీతోపాటు మరో నిందితుడిపై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది.

విదేశాల నుంచి భట్టీ ఈ దాడికి కుట్ర పన్నాడని, భారత్‌లోని స్థానిక వ్యక్తులతో కలిసి పనిచేసే ఉగ్ర మాడ్యూళ్ల విస్తృత నెట్‌వర్క్‌లో అతడి పాత్ర ఉందని NIA పేర్కొంది.

టార్గెట్‌ కిల్లింగ్స్‌, యువత నియామకం, ఆయుధాలు, మందుగుండు సామగ్రి అక్రమ రవాణాతో ఈ నెట్‌వర్క్‌కు సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైందని తెలిపింది.

వివరాలు 

యువతను ఆకర్షించేందుకు సోషల్‌ మీడియా వినియోగం

భట్టీ సోషల్‌ మీడియా ద్వారా భారత యువతతో పరిచయాలు పెంచుకుని వారిని ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినట్లు భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి.

తొలుత సోషల్‌ మీడియాలో చిన్నచిన్న పనులు అప్పగించడం, ఆ తర్వాత నెట్‌వర్క్‌లోకి చేర్చుకోవడం వంటి విధానాలను అనుసరించినట్లు దర్యాప్తులో ఆరోపణలు వచ్చాయి.

భారత్‌లో తన ప్రభావాన్ని పెంచుకునేందుకు సోషల్‌ మీడియా, ఎన్‌క్రిప్టెడ్‌ కమ్యూనికేషన్‌ వేదికలను ఉపయోగించినట్లు అధికారులు చెబుతున్నారు.

వివరాలు 

పలు రాష్ట్రాల్లో దర్యాప్తు

భట్టీ నెట్‌వర్క్‌కు సంబంధించి దిల్లీ, పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, హరియాణా, ఉత్తరాఖండ్‌ తదితర రాష్ట్రాల్లో కేసులు, దర్యాప్తులు కొనసాగుతున్నాయి.

భారత సార్వభౌమత్వం, సమగ్రతకు ముప్పు కలిగించే కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేశాయి.

వివరాలు 

మహారాష్ట్రలో 112 మందిని ప్రశ్నించిన ATS

2026 జూలైలో మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ (ATS) భట్టీతో సంబంధాలున్నాయనే అనుమానంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆపరేషన్‌ చేపట్టింది.

14 ప్రాంతీయ యూనిట్లకు చెందిన బృందాలు ఏకకాలంలో సోదాలు, విచారణలు నిర్వహించాయి.

భట్టీతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న 112 మందిని అధికారులు ప్రశ్నించారు.

సోషల్‌ మీడియా ద్వారా యువతను ప్రభావితం చేసి దేశ వ్యతిరేక కార్యకలాపాల వైపు మళ్లించేందుకు ప్రయత్నించాడా? అతడి నెట్‌వర్క్‌ ఎంతవరకు విస్తరించింది? అనే అంశాలపై డిజిటల్‌ ఆధారాలను ATS పరిశీలించింది.

ఆ దశలో ఎలాంటి అరెస్టులు జరగలేదని అధికారులు తెలిపారు.

వివరాలు 

200 మందికిపైగా అరెస్టులతో నెట్‌వర్క్‌పై ఉచ్చు

భట్టీ నెట్‌వర్క్‌పై దర్యాప్తు మరింత విస్తరించిన నేపథ్యంలో స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు భద్రతా బలగాలు కీలక చర్యలు చేపట్టాయి.

భట్టీ నేతృత్వంలోని, పాకిస్థాన్‌ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌ (ISI) మద్దతు ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న నెట్‌వర్క్‌ను ఛేదించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వెల్లడించారు.

ఈ ఆపరేషన్‌లో 200 మందికిపైగా నెట్‌వర్క్‌ సభ్యులను అరెస్టు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

భట్టీ నెట్‌వర్క్‌ను నిర్వీర్యం చేయడంలో భద్రతా బలగాల చర్యలను అమిత్‌ షా ప్రశంసించారు.

ADVERTISEMENT