
Cough Syrup: దగ్గుమందు ఎగుమతులపై భారత్‌ను ఆరా తీసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
ఈ వార్తాకథనం ఏంటి
తాజాగా దగ్గు మందు వల్ల చిన్నారుల మరణాల సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన సృష్టించింది. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లో విక్రయించిన 'కోల్డ్‌రిఫ్' దగ్గు సిరప్ వల్ల పలువురు చిన్నారులు ప్రాణాలను కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా స్పందించింది. ఈ ఔషధం ఎగుమతులపై భారత్‌ను ఆరా తీసినట్లు తెలుస్తోంది. "చిన్నారుల మృతులకు కారణమైన కోల్డ్‌రిఫ్ దగ్గు మందును ఇతర దేశాలకు ఎగుమతి చేశారా?" అని అని డబ్ల్యూహెచ్‌ఓ భారత్‌ను అడిగింది. సంబంధిత అధికారుల నుండి వివరాలు వచ్చిన తర్వాత ఈ మందుపై "గ్లోబల్ మెడికల్ ప్రొడక్ట్స్ అలర్ట్" జారీ చేయాలా లేదా అనే అంశంపై నిర్ణయం తీసుకోనుంది" అని ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.
వివరాలు
20కి పెరిగిన మృతులు
ఈ దగ్గుమందు కారణంగా చిన్నారుల మరణాలు పెరుగుతుండటం కలవరపెడుతోంది. మధ్యప్రదేశ్‌లో ఈ సిరప్ వలన మరణించిన చిన్నారుల సంఖ్య ఇప్పుడు 20కు చేరింది. చింద్వాడా జిల్లాలో మాత్రమే 17 చిన్నారులు ప్రాణాలను కోల్పోయారని మధ్యప్రదేశ్ ఆరోగ్య మంత్రి రాజేంద్ర శుక్లా బుధవారం ప్రకటించారు. అదేవిధంగా మరో ఐదుగురు చిన్నారులు తీవ్రమైన పరిస్థితిలో ఉన్నారని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో, రాజస్థాన్‌లో కూడా ఈ మందు కారణంగా కొంతమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం వస్తోంది.
వివరాలు
తయారీదారు కంపెనీకి చర్యలు
కోల్డ్‌రిఫ్ దగ్గుమందును తమిళనాడులోని కాంచీపురానికి చెందిన శ్రీసన్ ఫార్మా యూనిట్ తయారు చేసింది. మరణ ఘటనపై అధికారులు తనిఖీ నిర్వహించినపుడు సిరప్‌లో అత్యంత హానికరమైన రసాయన పదార్థం.. డైఇథైలిన్ గ్లైకాల్ 48.6% ఉన్నట్లు కనుగొన్నారు. ఇది చిన్నారుల ఆరోగ్యానికి తీవ్రంగా ప్రమాదకరమైన పదార్థంగా గుర్తించబడింది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని, సంబంధిత సంస్థపై అధికారులు కఠిన చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు, ఈ సిరప్‌పై ఇప్పటికే పలు రాష్ట్రాలు నిషేధం విధించాయి.