Quicksplained: జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదుల చేతిలో వీరమరణం పొందిన ఫాంటమ్.. 'నిజమైన హీరో'
జమ్ముకశ్మీర్ సుందర్బనీ సెక్టార్లోని అసన్ సమీపంలో సోమవారం ఉదయం ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో భారత ఆర్మీ శునకం ఫాంటమ్ ప్రాణాలు కోల్పోయింది. వైట్ నైట్ కార్ప్స్ ఈ విషాద సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. "మా వీర శునకం, ఫాంటమ్‌కి సెల్యూట్ చేస్తున్నాం. ధైర్యవంతుడైన భారత ఆర్మీ శునకం #Phantom, జయహో" అని వైట్ నైట్ కార్ప్స్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఉగ్రవాదులను కట్టడి చేయడానికి ఆర్మీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. కాల్పుల సమయంలో బుల్లెట్ గాయాలతో ఫాంటమ్ తీవ్ర గాయపడింది, చివరికి ప్రాణాలు కోల్పోయింది. ఫాంటమ్ ధైర్యం, విధేయత, అంకితభావం ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో నిలిచిపోతాయని వైట్ నైట్ కార్ప్స్ పేర్కొంది.
ఫాంటమ్ జీవిత విశేషాలు
2020 మే 25న జన్మించిన బెల్జియం మాలినోయిస్ జాతి ఫాంటమ్, తన అంకితభావంతో యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్‌లలో ఎంతో సేవలందించింది. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఆపరేషన్‌లో ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టినట్టు ఆర్మీ తెలిపింది. జమ్ముకశ్మీర్ సుందర్బనీ సెక్టార్లో ఉగ్రదాడి జమ్ముకశ్మీర్ అఖ్నూర్ సెక్టార్‌లోని అసన్ ఆలయం సమీపంలో సోమవారం ఉదయం ఉగ్రవాదులు ఆర్మీ కాన్వాయ్‌పై కాల్పులు జరిపారు. ఈ దాడి నేపథ్యంలో జమ్ము-కశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు గాలింపు ముమ్మరం చేసింది. నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి భద్రతను మరింత పటిష్ఠం చేయడానికి ఆర్మీ బీఎంపీ-2 యుద్ధ వాహనాలను రంగంలోకి దించింది. భద్రతా దళాలు వేగంగా ఎదురుకాల్పులు జరపడంతో ఎలాంటి సైనికుల ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
ఉగ్రవాదుల దాడిని నిరోధించడంలో విజయవంతం
వైట్ నైట్ కార్ప్స్ ఒక పోస్టులో "సుందర్బనీ సెక్టార్లోని అసన్ సమీపంలో ఉదయం ఆర్మీ వాహనాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతా దళాలు ఉగ్రవాదుల దాడిని నిరోధించడంలో విజయవంతమయ్యాయి. ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాము" అని తెలిపారు.