West Bengal: పశ్చిమ బెంగాల్ కొత్త సీఎం ఎవరు?
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పుల సంకేతాలు కనిపిస్తున్నాయి. సుమారు 15 ఏళ్ల తర్వాత అధికార మార్పు జరిగే అవకాశాలు ఉన్నట్లు ట్రెండ్స్ సూచిస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ అధికారానికి గుడ్‌బై చెప్పే పరిస్థితి ఉండగా, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటివరకు వచ్చిన ఆధిక్యాల్లో బీజేపీ 191 స్థానాల్లో ముందంజలో ఉండగా, టీఎంసీ 96 స్థానాల్లో కొనసాగుతోంది. దీంతో బీజేపీ శ్రేణులు ఇప్పటికే సంబరాలు ప్రారంభించాయి. ఇదే సమయంలో కొత్త ముఖ్యమంత్రి ఎవరు అన్న చర్చ జోరందుకుంది.
వివరాలు
సువేందు అధికారి సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువ
ముఖ్యమంత్రి రేసులో సువేందు అధికారి పేరు ముందంజలో వినిపిస్తోంది.ఆయన బెంగాల్‌లో బీజేపీకి ఫైర్‌బ్రాండ్ నాయకుడిగా పేరుగాంచారు. నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన,గతంలో టీఎంసీ నుంచి బీజేపీలో చేరి మమతా బెనర్జీపై గెలిచారు. ప్రస్తుతం కూడా ఆమెపై పోటీ చేయడం గమనార్హం. బీజేపీ ఎలాంటి సర్ప్రైజ్ నిర్ణయం తీసుకోకపోతే, ఆయన సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇక దిలీప్ ఘోష్ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన రాజకీయ ప్రయాణం ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ప్రారంభమైంది. ఖరగ్‌పూర్ సదర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన,తరువాత మెదినీపూర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కూడా అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
వివరాలు
సీఎం అభ్యర్థి రేసులో ఉన్న మహిళ నాయకులూ వీరే..
అలాగే సుకాంత మజుందార్ కూడా సీఎం అభ్యర్థి రేసులో ఉన్నారు. బాలుర్ఘాట్ నుంచి వరుసగా రెండుసార్లు ఎంపీగా గెలిచిన ఆయన, కేంద్రంలో రాష్ట్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీ కేంద్ర నాయకత్వంతో సన్నిహిత సంబంధాలు ఉండటం ఆయనకు ప్లస్‌గా మారింది. ఇవే కాకుండా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య పేరు కూడా వినిపిస్తోంది. మహిళకు సీఎం బాధ్యతలు అప్పగిస్తే లాకెట్ ఛటర్జీ, అగ్నిమిత్ర పాల్, అలాగే ప్రముఖ నటి రూపా గంగూలీ పేర్లు చర్చలోకి వస్తున్నాయి.