Delhi next CM : ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ తర్వాత తదుపరి సీఎం ఎవరు?
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం దిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. దిల్లీ తదుపరి సీఎం ఎవరో అన్న సందేహం అందరిని ఉత్కంఠలో ఉంచుతోంది. ఈ రేసులో ఆప్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులైన అతిషి, సౌరభ్ భరద్వాజ్, కైలాష్ గహ్లోత్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్ వంటి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ ఈ పదవిని చేపట్టే అవకాశాలను కొట్టిపారేయలేం.
దళిత నేతను తదుపరి ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం
కొంతమంది నేతలు దళిత నేతను తదుపరి ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.కానీ ఈ విషయంపై ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. కేజ్రీవాల్ తన మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బాధ్యతలు స్వీకరించే అవకాశాలను ఖండించారు. సిసోడియా, కేజ్రీవాల్ జైలులో ఉన్నప్పుడు, ఆప్ తరఫున అతిషి తీవ్ర స్థాయిలో పోరాటం చేసి వార్తల్లో నిలిచారు. కేజ్రీవాల్ స్వాతంత్ర్య దినోత్సవం రోజున త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి ఆమెనే నామినేట్ చేసినప్పటికీ, ఆమె నామినేషన్ తిరస్కరణకు గురైంది, తదనంతరం గహ్లోత్‌ను నియమించారు. కేజ్రీవాల్ రాజీనామా నిర్ణయం వెనుక ఉన్న కారణం ఏమిటంటే, దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 6 నెలల పాటు జైలులో ఉన్న ఆయనకు ఇటీవల సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
2014 ఫిబ్రవరి 16న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం
"ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తాను. ప్రజలు తమ తీర్పును వెల్లడించే వరకు నేను ఆ సీటులో కూర్చోను. దిల్లీలో ఇంకొన్ని నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. కోర్టులో నాకు న్యాయం జరిగింది. ఇప్పుడు ప్రజా కోర్టులో నాకు న్యాయం జరుగుతుంది. ప్రజల తీర్పు వచ్చిన తర్వాతే నేను తిరిగి దిల్లీ సీఎం కుర్చీలో కూర్చుంటాను," అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. 2013 ఎన్నికల్లో మొదటి విజయం సాధించిన కేజ్రీవాల్ 2014 ఫిబ్రవరి 16న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2025లో జరిగే రాష్ట్ర ఎన్నికల కోసం ఓటర్ల జాబితా ప్రస్తుత కసరత్తులో ఉంది. 2025 జనవరి 6న ఓటర్ల జాబితా తుది ప్రచురణ జరుగుతుందని సమాచారం.