Alliances in Telangana election: తెలంగాణ ఎన్నికలలో మిత్రులు ఎవరు? శత్రువులు ఎవరు? ఏ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుంది?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు మెజార్టీ సీట్లలో అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. నామినేషన్లు కూడా ప్రారంభమైన నేపథ్యంలో పొత్తులు కూడా దాదాపు ఖరారయ్యాయి. దీంతో ఈ ఎన్నికల్లో ఏ పార్టీతో ఏ పక్షం పొత్తు పెట్టుకుంది? ఎన్నికలలో మిత్రులు ఎవరు? శత్రువులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్), కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఆర్ఎస్ ప్రవీణ్ కూమార్ నేతృత్వంలోని బీఎస్పీ పోటీ చేస్తున్నా.. ఈ పార్టీ అంతగా ప్రభావం చూపించకవచ్చని సర్వే సంస్థలు చెబుతున్నాయి.
ఒంటరిగా బరిలోకి బీఆర్ఎస్
తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ సొంతంగా పోటీ చేస్తోంది. అయితే ఎన్నికల్లో బీఆర్ఎస్- ఏఐఎంఐఎం అధికారికంగా పొత్తు పెట్టుకోలేదు. కానీ, తొమ్మిది స్థానాల్లో మినహా ఏఐఎంఐఎం ఎక్కడా అభ్యర్థులను నిలబెట్టలేదు. ఆ తొమ్మిది స్థానాల్లో కూడా స్నేహపూర్వక పోటీ ఉంటుందని ఇరు పార్టీలు ప్రకటించాయి. అంతేకాకుండా, ఏఐఎంఐఎం అభ్యర్థులు పోటీ చేయని చోట, బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ బహిరంగంగా ప్రకటించడం, ఇరు పార్టీల మధ్య అప్రకటిత పొత్తును అర్థం చేసుకోవచ్చు. 2014 నుంచి ఈ రెండు పార్టీలు విడిగా పోటీ చేస్తున్నాయి. కానీ, ఏఐఎంఐఎం పోటీ చేయని చోట ఆ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ ఎన్నికల్లో కూడా అదే జరుగుతోంది.
కాంగ్రెస్‌కు టీజేఎస్, వైయస్ఆర్ తెలంగాణ పార్టీ మద్దతు
కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో బలమైన ప్రత్యర్థిగా బరిలోకి దిగుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ జనసమితి (టీజేఎస్) పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో బేషరతును ప్రకటించింది. ఈ మేరకు టీజీఎస్ చీఫ్ కోదండరామ్ ప్రకటించారు. 2018ఎన్నికల్లో కూడా కాంగ్రెస్-టీజీఎస్ కలిసి పోటీ చేశాయి. కానీ ఆ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. ఆ ఎన్నికల్లో టీజీఎస్ ఒక్క సీటు కూడా గెల్చుకోలేదు. అంతేకాకుండా, ఎన్నికల్లో తమ పార్టీ కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తుందని వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలారెడ్డి శుక్రవారం ప్రకటించారు. ఈ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌టీపీ పోటీ చేయదని ఆమె వెల్లడించారు. ఒక వేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, ఆమె సముచిత స్థానం కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు సమాచారం.
పోటీకి దూరంగా టీడీపీ.. కలిసి బరిలోకి దిగే యోచనలో సీపీఐ-సీపీఎం
తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకూడదని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తెలంగాణ యూనిట్ నిర్ణయించింది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల అరెస్టు కావడమే వారి గైర్హాజరీకి కారణమని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. పోటీలో ఉన్న మరే ఇతర పార్టీకి టీడీపీ ఇంకా మద్దతు పలకలేదు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-మార్క్సిస్ట్ సీపీఐ(ఎం) నవంబర్ 2న కాంగ్రెస్‌తో తన పొత్తు ప్రతిపాదనను విరమించుకుంది. ఈ క్రమంలో ఎన్నికల్లో పోటీ చేయనున్న 17 నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ప్రతిపాదించిన రెండు సీట్లు ఇవ్వకపోవడంతో కాంగ్రెస్‌తో సీపీఎం పొత్తును విరమించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు సీపీఐ- సీపీఎం మధ్య చర్చలు జరుగుతున్నాయి.
బీజేపీ-జనసేన పొత్తు
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ), జనసేన పార్టీ(జేపీఎస్) కలిసి పోటీ చేస్తున్నాయి. ఎన్నికల్లో 30పైగా సీట్లలో పోటీ చేయాలని జనసేన భావిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే మూడు జాబితాలను విడుదల చేసిన బీజేపీ, నాలుగో జాబితాలో జనసేన అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పవన్ కళ్యాణ్‌తో అక్టోబర్ 27న సమావేశంలో సీట్ల పంపకంపై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. 2018 తెలంగాణ ఎన్నికల్లో 119 స్థానాలకు గాను అధికార బీఆర్‌ఎస్ 88 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 19 సీట్లు గెలుచుకుంది. బీజేపీ ఒక్క సీటు, టీడీపీ రెండు సీట్లు, ఏఐఎంఐఎం ఏడు సీట్లు గెలుచుకున్నాయి. 119 మంది సభ్యులున్న తెలంగాణ అసెంబ్లీకి నవంబర్ 30న పోలింగ్ జరగనుంది.