Shankaracharyas: రామాలయ ప్రతిష్టాపనకు నలుగురు శంకరాచార్యులు ఎందుకు రావట్లేదు? స్వామి నిశ్చలానంద ఏమన్నారు?
జనవరి 22న అయోధ్యలో నిర్మించిన రామమందిర ప్రతిష్ఠాపన మహోత్సవం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరాముడికి అభిషేకం చేయనున్నారు. అయితే శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట మహోత్సవానికి దేశంలోని ఇద్దరు శంకరాచార్యులు హాజరయ్యేందుకు నిరాకరించారు. నలుగురు శంకరాచార్యుల్లో ఇద్దరు హాజరు కావడం లేదని చెప్పడంతో పాటు మరో ఇద్దరు మౌనంగా ఉన్నారు. రామమందిరం ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమానికి శంకరాచార్యులు హాజరుకాకపోవడానికి గల కారణాలేమిటో పూరీలోని గోవర్ధన పీఠం శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి మహరాజ్ తెలిపారు. అహంతో ఆలయ ప్రతిష్ఠాపన వేడుకలకు దూరంగా ఉండటం లేదన్నారు. శంకరాచార్యుల గౌరవాన్ని నిలబెట్టడానికి తీసుకున్న నిర్ణయంగా చెప్పుకొచ్చారు.
ప్రధానమంత్రి గర్భగుడిలో ఉండటం వెనుక రాజకీయ కోణం: నిశ్చలానంద సరస్వతి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించినప్పుడు అక్కడ బయట కూర్చుని చప్పట్లు కొట్టాలని వారు భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. గతవారం కూడా పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి అయోధ్య రామాలయ ప్రారంభోత్సవంపై మాట్లాడారు. శ్రీరాముని ప్రతిష్ఠాపనను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలన్నారు. ప్రధానమంత్రి గర్భగుడిలో ఉండటం వెనుక రాజకీయ కోణం ఉన్నట్లు ఆయన చెప్పారు. అయితే తాము దీన్ని వ్యతిరేకించడం లేదు.. కానీ హాజరు మాత్రం కావడం లేదన్నారు. ఇతర కారణాలతో పాటు.. గర్భగుడిలో మోదీ ఉండటం వల్ల తాము హాజరు కాబోమని ఉత్తరాఖండ్‌లోని చమోలీలోని జోషిమఠ్ మఠానికి చెందిన శంకరాచార్యులు చెప్పారు.
నలుగురు శంకరాచార్యుల ఎవరు?
సనాతన ధర్మంలో శంకరాచార్య పదవి అత్యున్నతమైనదిగా పరిగణిస్తారు. హిందూమత వ్యాప్తి కోసం ఆదిశంకరాచార్యులు భారతదేశంలో నాలుగు దిక్కుల్లో నాలుగు మఠాలను స్థాపించారు. నాలుగు మఠాల్లో ఉత్తరాన బదరికాశ్రమానికి చెందిన జ్యోతి మఠం, దక్షిణాన శృంగేరి మఠం, తూర్పున జగన్నాథపురి గోవర్ధన్ మఠం, పశ్చిమాన ద్వారకలోని శారదా మఠం ఉన్నాయి. ఈ నాలుగు మఠాల అధిపతిని శంకరాచార్యులు అంటారు. ఈ మఠాలను స్థాపించిన తరువాత, ఆదిశంకరాచార్య తన నలుగురు ప్రధాన శిష్యులకు బాధ్యతను అప్పగించారు. ప్రస్తుతం ఒడిశాలోని పూరిలోని గోవర్ధన్ మఠాధిపతిగా నిశ్చలానంద సరస్వతి శంకరాచార్య, గుజరాత్‌లోని ద్వారకాధామ్‌లోని శారదా మఠానికి సదానంద సరస్వతి, ఉత్తరాఖండ్‌లోని బదరికాశ్రమంలోని జ్యోతిర్మఠానికి స్వామి అవిముక్తేశ్వరానంద్, రామేశ్వరంలో ఉన్న శృంగేరి మఠానికి జగద్గురు భారతీ తీర్థ శంకరాచార్యగా ఉన్నారు.
మౌనంగా ఇద్దరు శంకరాచార్యులు
శృంగేరి మఠానికి చెందిన శంకరాచార్య భారతీ తీర్థులు, గుజరాత్‌లోని ద్వారకలోని శారదా పీఠానికి చెందిన శంకరాచార్య సదానంద సరస్వతి అయోధ్యకు వెళ్లడంపై ఇంకా స్పందించలేదు. వారు కూడా హాజరుకావడం లేదని వార్తలు వస్తున్నటికీ.. వారు మాత్రం మౌనం వీడటం లేదు. అయితే మౌనంగా ఉన్నారంటే.. వారు హాజరుకాకపోవచ్చని తెలుస్తోంది. రామాలయ ప్రారంభోత్సవానికి హాజరవడంపై నలుగురు శంకరాచార్యులు మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నిశ్చలానంద సరస్వతి శంకరాచార్య స్పందిచారు. తమ మధ్య ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని చెప్పారు. తాము నలుగురం రామాలయ ప్రారంభోత్సవానికి హాజరుకావడం లేదన్నారు.
శంకరాచార్యుల ప్రకటనపై రాజకీయ రగడ
శంకరాచార్యులు చేసిన ప్రకటనపై రాజకీయ రగడ నెలకొంది. రామాలయ ప్రారంభోత్సవానికి దూరంగా ఉంటున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టను రాజకీయ కార్యక్రమంగా కాంగ్రెస్ ప్రకటించింది. అయితే దీనిపై బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శించింది. హిందూ వ్యతిరేకిగా ఆరోపణలు గుప్పించింది. ఇదే సమయంలో ఇద్దరు శంకరాచార్యులు ఆలయ ప్రారంభోత్సవానికి హాజరుకావడం లేదని ప్రకటించారు. అంతేకాదు, ఆలయం అసంపూర్తిగా ఉండగానే ప్రారంభిస్తున్నారని స్వయంగా ఈ ఇద్దరు మతపెద్దలు విమర్శించడం.. ఇప్పుడు బీజేపీని ఇరుకునే పెట్టే అంశమైంది. దీంతో కాంగ్రెస్‌ను బీజేపీ విమర్శించడానికి అవకాశం లేకుండా పోయింది.