LOADING...
Ayodhya Ram Temple Donation Row: 'ఎందుకు మౌనం?' - రామమందిర విరాళాల చోరీపై మోదీని ప్రశ్నించిన కాంగ్రెస్
'ఎందుకు మౌనం?' - రామమందిర విరాళాల చోరీపై మోదీని ప్రశ్నించిన కాంగ్రెస్

Ayodhya Ram Temple Donation Row: 'ఎందుకు మౌనం?' - రామమందిర విరాళాల చోరీపై మోదీని ప్రశ్నించిన కాంగ్రెస్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 01, 2026
11:28 am

ఈ వార్తాకథనం ఏంటి

అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగ ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మౌనంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ఈ వ్యవహారంలో ప్రధాని ఇప్పటికైనా స్పందించాలని, కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని కాపాడేందుకు పారదర్శక దర్యాప్తు నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జైరాం రమేశ్ చేసిన ట్వీట్ 

వివరాలు 

ట్రస్ట్ ఏర్పాటుపై కాంగ్రెస్ ప్రశ్నలు

రామమందిర నిర్మాణం, శ్రీరాముడి పేరును రాజకీయంగా వినియోగించుకున్న బీజేపీ ఇప్పుడు విరాళాల దుర్వినియోగ ఆరోపణలపై ఎందుకు మౌనం పాటిస్తోందని జైరాం రమేశ్ ప్రశ్నించారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ను కేంద్ర ప్రభుత్వం పారదర్శక ప్రమాణాలు లేకుండానే ఏర్పాటు చేసిందని, అందులో ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వ్యక్తులను నియమించిందని ఆరోపించారు. అనంతరం ఆ ట్రస్ట్‌ను సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) పరిధి నుంచి మినహాయించడం మరిన్ని అనుమానాలకు కారణమైందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఈ అంశంపై మౌనం వీడి స్పష్టత ఇవ్వాలని కోరారు.

Advertisement

వివరాలు 

అయోధ్యలో అజయ్ రాయ్‌ను అడ్డుకున్నారన్న ఆరోపణ

ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం మంగళవారం అయోధ్యకు వెళ్లి శ్రీరాముడి దర్శనం చేసుకోవాలని నిర్ణయించగా, యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. అయోధ్య చేరుకున్న కొద్దిసేపటికే పోలీసులు హోటల్‌కు వచ్చి తనను అదుపులోకి తీసుకున్నారని అజయ్ రాయ్ తెలిపారు. ప్రతిపక్షాల పట్ల భయంతోనే బీజేపీ ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఉపయోగిస్తోందని ఆయన విమర్శించారు. తమ ప్రతినిధి బృందం శాంతియుతంగా ప్రార్థనలు చేసేందుకు మాత్రమే వెళ్లినా పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు.

Advertisement

వివరాలు 

సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు కోరిన కాంగ్రెస్

రామమందిర విరాళాల దుర్వినియోగ ఆరోపణలు తీవ్రంగా ఉన్నందున ఈ కేసును సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అలాగే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ను రద్దు చేయాలని కూడా కోరింది. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కూడా బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడిని మోసం చేసిన పార్టీకి నిజమైన సనాతనులు మద్దతు ఇవ్వకూడదని, ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయవద్దని ఆయన పిలుపునిచ్చారు.

వివరాలు 

నిందితులపై కఠిన చర్యలు: బీజేపీ

ఈ వ్యవహారంలో నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని బీజేపీ స్పష్టం చేసింది. హిందూ సమాజం నుంచి కూడా వారికి సామాజిక బహిష్కరణ ఎదురవుతోందని పేర్కొంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే దోషులకు ఆదర్శప్రాయమైన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారని పార్టీ వెల్లడించింది.

వివరాలు 

నిందితులకు న్యాయ సహాయం అందించబోమన్న బార్ అసోసియేషన్

అయోధ్యలోని ఫైజాబాద్ బార్ అసోసియేషన్ ఈ కేసులో అరెస్టయిన ఎనిమిది మంది నిందితులకు తమ సభ్యుల్లో ఎవరూ న్యాయ సహాయం అందించబోరని ప్రకటించింది. అలాగే ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో రామమందిర విరాళాల అక్రమాలపై దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ శీల్ నాగు ధర్మాసనం వేసవి సెలవుల అనంతరం విచారణ చేపడతామని తెలిపింది. జూలై 13 నుంచి సుప్రీంకోర్టు తిరిగి ప్రారంభం కానుండటంతో ఆ తర్వాత ఈ కేసు విచారణ జరగనుంది.

వివరాలు 

ఇప్పటికే ఎనిమిది మంది అరెస్టు

విరాళాల దుర్వినియోగ ఆరోపణలు వెలుగులోకి రావడంతో జూన్ 13న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. సిట్ నివేదిక ఆధారంగా అవినాశ్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవ్‌కుశ్ మిశ్రా, మనీశ్ కుమార్ యాదవ్, కరుణేశ్ పాండే, రామ్ శంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ, రామశంకర్ అలియాస్ టిన్నూ యాదవ్‌లను పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement