'పాలకవర్గాన్ని ఎందుకు రద్దు చేయకూడదు?' మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటనపై మున్సిపాలిటీకి షాకాజ్ నోటీసులు
గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై స్థానిక మున్సిపాలిటీకి రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విధుల నిర్వహణలో ఘోరంగా విఫమైన మున్సిపాలిటీ పాలకవర్గాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ఆ నోటీసుల్లో పేర్కొంది. గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో అక్టోబర్ 30న కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ప్రమాదంలో 135 మంది మృతి చెందగా.. వందల మంది గాయపడ్డారు. ఈ ఘటనను గుజరాత్ హైకోర్టు సీరియస్‌గా తీసుకుంది. 135 మంది మరణించిన ఘటనపై హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానిక అధికారులకు నోటీసులు సైతం జారీ చేసింది.
ఈ నెల 25వ తేదీలోపు వివరణ ఇవ్వాలి: ప్రభుత్వం
ఈ నెల 25వ తేదీలోపు షోకాజ్ నోటీసులకు వివరణ ఇవ్వాలని మోర్బీ మున్సిపాలిటీకి రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ స్పష్టం చేసింది. పాలక వర్గం సమావేశాన్ని ఏర్పాటు చేసి, తీర్మానం రూపంలో లిఖితపూర్వకంగా ఆ వివరణ ఉండాలని మున్సిపాలిటిని ఆదేశించింది. గతేడాది డిసెంబర్ 13న హైకోర్టులో విచారణ సందర్భంగా కూడా విధుల్లో నిర్లక్ష్యం వహించిన మున్సిపాలిటీ పాలక వర్గాన్ని రద్దు చేయనున్నట్లు ధర్మాసనానికి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఈ మేరకు హైకోర్టులో పిల్‌ను కూడా దాఖలు చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వంతెనలు ఉన్నాయో వాటిపై సర్వే చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.