LOADING...
Punjab village: పంజాబ్'లోని ఈ గ్రామంలో ప్రేమ వివాహాలు నిషేధం.. ఎందుకంటే..? 
పంజాబ్'లోని ఈ గ్రామంలో ప్రేమ వివాహాలు నిషేధం.. ఎందుకంటే..?

Punjab village: పంజాబ్'లోని ఈ గ్రామంలో ప్రేమ వివాహాలు నిషేధం.. ఎందుకంటే..? 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 05, 2025
05:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

చండీగఢ్‌ సమీపంలోని మొహాలీ జిల్లాలోని మనక్‌పూర్ షరీఫ్ అనే గ్రామంలో గ్రామపంచాయితీ తీసుకున్న ఓ నిర్ణయం తీవ్ర చర్చనీయాంశమైంది. జూలై 31న గ్రామ పెద్దలందరూ ఏకగ్రీవంగా ఓ తీర్మానం చేసి, కుటుంబ సభ్యులు లేదా సమాజం అంగీకారం లేకుండా ప్రేమ వివాహాలు చేసుకున్న జంటలను గ్రామంలో ఉండనీయబోమని స్పష్టం చేశారు. ఈ తీర్మానం ప్రకారం, అటువంటి జంటలకు గ్రామం గానీ, పరిసర ప్రాంతాల్లో గానీ చోటు ఉండదని, వారిని ఆశ్రయించే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. "ఇది శిక్ష కాదండి.. మా సంప్రదాయాలు, విలువలు కాపాడుకోవడానికే తీసుకున్న జాగ్రత్త చర్య" అని గ్రామ సర్పంచ్ దల్వీర్ సింగ్ చెప్పారు.

వివరాలు 

ఈ సంఘటన 2,000 మంది గ్రామస్థుల మనసులను కలిచివేసింది 

ఇటీవల గ్రామంలో జరిగిన ఒక ఘటన వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సింగ్ వెల్లడించారు. 26 ఏళ్ల దవీందర్ అనే యువకుడు తన 24 ఏళ్ల మేనకోడలు బేబీని పెళ్లిచేసుకోవడంతో గ్రామస్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ జంట అప్పటికే గ్రామం విడిచిపోయిందని, కానీ ఈ సంఘటన 2,000 మంది గ్రామస్థుల మనసులను కలిచివేసిందని సర్పంచ్ పేర్కొన్నారు. అయితే, ప్రేమ వివాహాలకి విరుద్ధమనే ఉద్దేశం తమకు లేదని, కానీ పంచాయతీ పరంగా ఇలాంటి వివాహాలను అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సమాజం మొత్తం బాధ్యత తీసుకోవాలని, ఇతర గ్రామాలూ ఇదే తరహా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

వివరాలు 

ప్రపంచం ఎంత మారినా మన బంధాలు, సంస్కృతి, గ్రామాలు కాపాడుకోవాలి

ఈ తీర్మానంపై ఇప్పటికే రాజకీయ నేతలు,మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా స్పందించాయి. పటియాలా కాంగ్రెస్ ఎంపీ ధర్మవీర్ గాంధీ ఈ తీర్మానాన్ని "తాలిబానీ ఫత్వా"గా అభివర్ణించారు. "తన ఇష్టమైన జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు ప్రతి పెద్దవారికీ ఉంది. ఈ తరహా సంప్రదాయవాద ధోరణులకు రాష్ట్రం అడ్డుకట్ట వేయాలి" అని గాంధీ స్పష్టం చేశారు. అయితే, కొందరు గ్రామస్థులు మాత్రం సర్పంచ్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. "ఈ నిర్ణయాన్ని మేము సమర్థిస్తున్నాం. మాకు ఒక పరంపర ఉంది, మంచి పేరు ఉంది. ప్రపంచం ఎంత మారినా మన బంధాలు, సంస్కృతి, గ్రామాలు కాపాడుకోవాలి" అని పేరు చెప్పడం ఇష్టం లేని ఓ స్థానిక వ్యక్తి తెలిపారు.

వివరాలు 

రాజ్యాంగ చట్టాలకే ప్రాధాన్యం

ఇక ఈ వ్యవహారంపై మొహాలీ అదనపు కలెక్టర్ (గ్రామీణ) సోనం చౌధరీ మాట్లాడుతూ, "ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ఫిర్యాదు రాలేదు.పెద్దవాళ్లు అయినవాళ్లు ఎవరి పెళ్లి కావాలనుకున్నా చేసుకోవచ్చు.ఫిర్యాదు వస్తే చట్టప్రకారం వ్యవహరిస్తాం" అన్నారు. పోలీసు సూపరింటెండెంట్ మోహిత్ అగర్వాల్ కూడా రాజ్యాంగ చట్టాలకే ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. పంజాబ్ స్టేట్ వుమెన్ కమిషన్ ఛైర్‌పర్సన్ రాజ్ లల్లి గిల్ ఈ తీర్మానాన్ని తీవ్రంగా ఖండించారు. "ఇది రాజ్యాంగ విరుద్ధం. గ్రామపంచాయతీ తీసుకున్న ఈ తరహా నిర్ణయాలకు చట్టపరంగా విలువ లేదు. మేము ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తాం. ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదు రాలేదు" అని ఆమె పేర్కొన్నారు.