
కర్నులు: భర్త మృతదేహాన్ని ఇంట్లోనే దహనం చేసిన భార్య
ఈ వార్తాకథనం ఏంటి
తన భర్త చనిపోయిన విషయం తమ ఇద్దరు కుమారులకు తెలిస్తే ఆస్తి కోసం గొడవ పడిపోతారనే భయంతో ఓ మహిళ ఇంట్లోనే కట్టుకున్నవాడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించింది.
ఈ విషాదకర ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో సోమవారం జరిగింది.
తమ ఇద్దరు కుమారులు తమను పట్టించుకోవడం లేదని, తండ్రి మరణవార్త తెలిస్తే ఆస్తి కోసం వచ్చి గొడవపడతారన్న భయంతోనే ఇలా చేసినట్లు ఆ మహిళ పోలీసులకు తెలిపింది.
ఈ క్రమంలో పోలీసులు మహిళను విచారించారు. ఆమె మానసిక స్థితి సరిగా లేదని ప్రాథమిక అంచనాకు వచ్చారు. కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
అట్టపెట్టెలతో భర్త మృతదేహానికి దహన సంస్కారాలు
తన భర్త హరికృష్ణ ప్రసాద్ (60) ఆరోగ్యం బాగోలేక తెల్లవారుజామున మృతి చెందాడని భార్య లలిత పోలీసులకు తెలిపారు.
తన భర్త మరణం గురించి బంధువులకు ఎవరికీ సమాచారం ఇవ్వకుండా, అతనికి ఇంట్లో దహన సంస్కారాలు నిర్వహించాలని నిర్ణయించింది.
ఇందుకోసం అట్టపెట్టెలను సేకరించింది. ఆ తర్వాత మృతదేహాన్ని దహనం చేసింది.
అయితే ఇంట్లో నుంచి పొగలు రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు అక్కడికి చేరుకోగా.. ఇంట్లోనే తన భర్త అంత్యక్రియలు చేశానని లలిత వెల్లడించింది.
హరికృష్ణ ప్రసాద్, లలిత దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తుండగా, చిన్న కొడుకు కెనడాలో స్థిరపడ్డాడు.