
చంద్రగిరిలో 'నిజం గెలవాలి' యాత్రను ప్రారంభించిన నారా భువనేశ్వరి
ఈ వార్తాకథనం ఏంటి
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం తిరుపతి జిల్లా నుంచి 'నిజం గెలవాలి' యాత్రను లాంఛనంగా ప్రారంభించారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి రాజమహేంద్రవరం జైలులో ఉన్న నేపథ్యంలో మరణించిన వారి బంధువులను ఓదార్చేందుకు ఈ యాత్రను ప్లాన్ చేశారు.
ఇంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన భువనేశ్వరి.. ఈ యాత్ర ద్వారా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి రావడం ఇదే తొలిసారి.
బస్సు యాత్ర వివిధ దశల్లో ఉంటుంది. మొదటి దశలో చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తిలో మూడు రోజుల పాటు ఉండనుంది.
తొలిరోజు చంద్రగిరిలో చంద్రబాబు అరెస్టుతో మనస్థాపానికి గురై మరణించిన నేండ్రగుంట గ్రామానికి చెందిన కె. చిన్నబ్బ కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు.
చంద్రబాబు
చంద్రబాబు ఎప్పుడు ప్రజలకోసమే ఆలోచించారు: భువనేశ్వరి
ఓదార్పు అనంతరం ఏర్పాటు అగరాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భువనేశ్వరి మాట్లాడారు.
తాను రాజకీయాలు చేసేందుకు ఇక్కడికి రాలేదన్నారు. నిజం గెలవాలని, ఈ యాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఇది తన ఒక్కరి పోరాటం కాదన్నారు. చంద్రబాబు ఎప్పుడు ప్రజలకోసమే ఆలోచించారన్నారు.
ప్రజల తర్వాతే కుటుంబం గురించి ఆలోచించేవాళ్లన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు, రింగ్‌రోడ్, ఫైబర్‌నెట్ కేసులు తన భర్తపై బనాయించారని, అందులో ఒక్క కేసుకైనా ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు.
రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన నిత్యం కష్టపడ్డారన్నారు. ఆయన తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా కష్టపడ్డారన్నారు.
తన కుమారుడు లోకేశ్ చేపట్టిన యువగళం యాత్రను కూడా ఆపేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించారన్నారు. అయినా, ఏమీ చేయలేకపోయారు.