నెల్లూరులో యువగళం పూర్తయ్యాక తెదేపా సభ్యత్వం తీసుకుంటా : ఆనం రాంనారాయణ రెడ్డి
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరిగాయి. తెదేపా అధినేత చంద్రబాబును వైకాపా బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి కలవడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. రానున్న ఎన్నికల్లో ఆత్మకూరులో సైకిల్ గుర్తుపై పోటీ చేసే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది.
శాసనమండలి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారన్న కారణంతో ఆనంపై వైకాపా అధిష్ఠానం వేటు వేసింది.ఈ నేపథ్యంలో ఆనం గత రాత్రి జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసంలో సమావేశం అవ్వడం రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తోంది.
అనంతరం హైదరాబాద్ నుంచి ఆనం నెల్లూరుకు వచ్చేశారు. ఈ క్రమంలో తన నివాసంలో ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు తెదేపా ఉమ్మడి జిల్లా నేతలు, మాజీ మంత్రులు సోమిరెడ్డి, అమర్‌నాథ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
టీడీపీ
జిల్లాలో యువగళం పాదయాత్రను విజయవంతం చేస్తాం: ఆనం
ఈ నేపథ్యంలో నెల్లూరులో జరగబోయే లోకేశ్ యువగళం పాదయాత్ర స్వాగత ఏర్పాట్లపై నేతలు చర్చించుకున్నారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన ఆనం, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర నెల్లూరులో జరగబోతోందన్నారు.
నిన్ననే పార్టీ అధినేత చంద్రబాబుతో మాట్లాడానని, నెల్లూరు జిల్లాలో లోకేష్ పాదయాత్రను విజయవంతం చేస్తామన్నారు. ఈ సందర్భంగా పాదయాత్రను సమర్థంగా నిర్వహించేందుకు కావాల్సిన ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు.
ఉమ్మడి జిల్లాలోని నేతలందరిని కలుపుకుంటూ పార్టీని బలోపేతం చేస్తామన్నారు. జిల్లాలో పాదయాత్ర పూర్తి అయ్యాక తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుంటానని స్పష్టం చేశారు. ఈ మేరకు నెల్లూరులో యువగళం పాదయాత్రను జయప్రదం చేస్తామని ఆనం తెలిపారు.