Parliament: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. ప్రారంభం నుంచే గందరగోళం… రెండుసభలు వాయిదా
ఈ వార్తాకథనం ఏంటి
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈసారి సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 13 కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు అంచనా. ఇదే సమయంలో ఎస్‌ఐఆర్ (ఓటర్ లిస్ట్ ప్రత్యేక సవరణ), దేశంలో పెరుగుతున్న వాయు కాలుష్యం వంటి ప్రధాన సమస్యలపై ప్రభుత్వాన్ని కోణర్ చేయడానికి విపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి.
Details
ప్రారంభం నుంచే హంగామా
సభలు ప్రారంభమైన కొద్దిసేపటికే లోక్‌సభలో గందరగోళం చెలరేగింది. ఎస్‌ఐఆర్‌పై వెంటనే చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టాయి. దీంతో రెండు సభలు వాయిదా పడ్డాయి. విపక్ష ఎంపీల అల్లర్లు, నినాదాల మధ్య లోక్‌సభ సమావేశం కొంతకాలం కొనసాగింది. స్పీకర్ ఓం బిర్లా విపక్షాలను శాంతింపజేయడానికి ప్రయత్నించినా పరిస్థితి సద్దుమణగలేదు. చివరకు సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఇక రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణణ్‌కి సభలో స్వాగతం పలికారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఇంత ఉన్నత స్థానానికి చేరడం ప్రజాస్వామ్య శక్తిని ప్రతిబింబిస్తుందని ప్రధాని కొనియాడారు.
Details
విపక్షాలపై ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు
సభల ప్రారంభానికి ముందు పార్లమెంట్ ఆవరణలో మోదీ మీడియాతో మాట్లాడారు. ఇందులో విపక్షాలను పరోక్షంగా లక్ష్యంగా చేసుకున్నారు. కొన్ని పార్టీలు బీహార్ ఎన్నికల ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాయని విమర్శించారు. ఎన్నికల ఫలితాలపై కోపాన్ని తీర్చుకునే స్థలంగా లేదా అహంకారాన్ని చూపించే వేదికగా పార్లమెంట్ మారకూడదని హెచ్చరించారు. శీతాకాల సమావేశాల్లో సభల పనితీరుకు విఘాతం కలగకుండా చూడాలని విపక్షాలను కోరిన ప్రధాని, ''అవసరమైతే ప్రతిపక్షానికి కొన్ని చిట్కాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నానని అన్నారు
Details
ప్రతిపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలి
. బిహార్‌లో జరిగిన రికార్డు స్థాయి పోలింగ్, మహిళల భారీ స్పందన ప్రజాస్వామ్యంలో నమ్మకాన్ని పెంచుతున్నాయన్న ప్రధాని, 'ప్రపంచం భారత్‌ను జాగ్రత్తగా గమనిస్తోంది. ప్రజాస్వామ్యం ఫలితాలను ఇవ్వగలదని దేశం నిరూపించిందని అన్నారు. దేశం ఏ దిశగా సాగుతోందన్న విషయంపై పార్లమెంట్ దృష్టి సారించాలని సూచించారు. 'ప్రతిపక్షం కూడా తమ బాధ్యతను నిర్వర్తించాలి. ముఖ్యమైన అంశాలను చర్చకు తేవాలి. ఓటమి నిరాశను వదలాలి. కానీ కొన్ని పార్టీలు ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాయని వ్యాఖ్యానించారు.
Details
యువ ఎంపీలకు అవకాశం ఇవ్వాలని మోదీ విజ్ఞప్తి
తొలిసారి ఎన్నికైన ఎంపీలు మాట్లాడే అవకాశం లేక ఇబ్బంది పడుతున్నారని ప్రధాని చెప్పారు. 'యువ ఎంపీలు తమ సామర్థ్యాలను చూపించడానికి, తమ నియోజకవర్గాల సమస్యలపై మాట్లాడడానికి అవకాశం రావడం లేదని బాధపడుతున్నారు. దేశ అభివృద్ధిలో పాల్గొనడానికి వారు చూపుతున్న ఉత్సాహానికి అడ్డంకులు వస్తున్నాయని తెలిపారు. వారు ఏ పార్టీకి చెందినవారైనా సరే, తొలి సారి గెలిచిన ఎంపీలకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని మోదీ స్పష్టం చేశారు.