Kanpur man: మూడు స్టోరీలు చెప్పి.. స్కామర్‌నే బురిడీ కొట్టించిన కాన్పూర్ వ్యక్తి ..!
ఈ వార్తాకథనం ఏంటి
"మీ పేరుతో డ్రగ్స్ పార్శిల్ వచ్చింది","మీరు డిజిటల్ అరెస్టులో ఉన్నారు" అంటూ ఈ మధ్య కాలంలో నకిలీ కాల్స్ చేసి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు.
అయితే, ఇటువంటి స్కామ్‌లో ఓ యువకుడికి కాల్ రాగా... అతను ఏమాత్రం భయపడలేదు.
పైగా స్కామర్‌ను బురిడీ కొట్టించిన విధానం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
సైబర్ మోసగాడికి సదరు యువకుడు షాకిచ్చిన వైనం!
జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన భూపేంద్ర సింగ్ (Bhupendra Singh) అనే యువకుడికి సీబీఐ అధికారి పేరుతో ఓ నకిలీ కాల్ వచ్చింది.
"మీ వద్ద అభ్యంతరకర వీడియోలు ఉన్నాయ్, కేసును మూసివేయాలంటే ₹16,000 ఇవ్వాలి" అంటూ స్కామర్ బెదిరించే ప్రయత్నం చేశాడు.
వివరాలు
స్కామర్‌ను తప్పుదోవ పట్టించిన భూపేంద్ర!
అయితే, ఈ కాల్ ఏదో తేడా కొడుతోందని అనుమానించిన భూపేంద్ర... సైబర్ మోసగాడిని ఆటపట్టించాలని డిసైడ్ అయ్యాడు.
"దయచేసి ఈ విషయం మా అమ్మకు చెప్పొద్దు, చెప్పినట్లయితే నేను పెద్ద సమస్యలో పడిపోతాను" అంటూ నటించాడు.
దీనితో స్కామర్ మరింత ఒత్తిడి పెంచి డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కానీ భూపేంద్ర వ్యూహాత్మకంగా స్పందించాడు.
తాను బంగారు గొలుసును తాకట్టు పెట్టానని, దాన్ని తీసుకోవడానికి ₹3,000 అవసరమని చెప్పాడు.
స్కామర్ అసలు విషయం అర్థం చేసుకోకుండా భూపేంద్ర మాటలను నమ్మి ముందుగా ₹3,000 పంపించాడు. అయితే, వ్యవహారం ఇక్కడితో ఆగలేదు.
వివరాలు
భూపేంద్రకి డబ్బులు పంపిన స్కామర్
తాను మైనర్ కావడంతో ఆ నగల వ్యాపారి తన గొలుసు ఇచ్చేందుకు నిరాకరించాడని చెప్పాడు.
"మీరే నా తండ్రిలా నగల వ్యాపారితో మాట్లాడండి" అంటూ స్కామర్‌ను మభ్యపెట్టాడు.
మరోవైపు, భూపేంద్ర స్నేహితుడు నగల వ్యాపారి అవతారం ఎత్తి, స్కామర్‌తో మాట్లాడాడు. స్కామర్ అతని మాటలను నమ్మి మరోసారి ₹4,480 పంపాడు.
అంతేకాకుండా, "ప్రాసెసింగ్ ఫీజు కింద ₹3,000 ఇస్తే, గొలుసుపై ₹1.10 లక్షల రుణం పొందొచ్చు" అని చెబుతూ మోసగాడిని మరింత మభ్యపెట్టాడు.
ఈ మాటలతో మరొకసారి స్కామర్ డబ్బులు పంపాడు. మొత్తంగా, స్కామర్ భూపేంద్రకు దాదాపు ₹10,000 పంపించాడు.
వివరాలు
పోలీసులను ఆశ్రయించిన భూపేంద్ర!
తాను మోసపోయానని ఆలస్యంగా గుర్తించిన స్కామర్, తన డబ్బు తిరిగి ఇవ్వమని భూపేంద్రను బతిమాలాడు.
కానీ భూపేంద్ర వెంటనే పోలీసులను సంప్రదించి జరిగినదంతా వివరించాడు.
ఇక తనకు వచ్చిన ₹10,000 మొత్తాన్ని విరాళంగా ఇస్తానని ప్రకటించాడు.
ఈ ఘటన నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. స్కామర్ల బెదిరింపులకు భయపడకుండా, చాకచక్యంగా వారినే మోసం చేసి తనను తాను రక్షించుకున్న భూపేంద్ర, చాలా మందికి స్ఫూర్తిగా నిలిచాడు!