Loading...
Hyderabad: ఆస్టన్‌ మార్టిన్‌ ఢీకొని యువతి మృతి.. ఎంపీ కుమారుడిపై కేసు నమోదు
ఆస్టన్‌ మార్టిన్‌ ఢీకొని యువతి మృతి.. ఎంపీ కుమారుడిపై కేసు నమోదు

Hyderabad: ఆస్టన్‌ మార్టిన్‌ ఢీకొని యువతి మృతి.. ఎంపీ కుమారుడిపై కేసు నమోదు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 21, 2026
03:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఇనార్బిట్‌ మాల్‌ వద్ద ఈ నెల 16న మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో లైఫ్‌స్టైల్‌ స్టోర్‌ ఉద్యోగిని భారతి ముఖి (26) మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు, జనసేన పార్టీ నేత లింగమనేని రమేష్‌ కుమారుడు లింగమనేని సంజుష్‌ (23) నడిపిన ఆస్టన్‌ మార్టిన్‌ స్పోర్ట్స్‌ కారు ఆమెను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వివరాలు 

జీబ్రా క్రాసింగ్‌పై రోడ్డు దాటుతుండగా..

భారతి ముఖి ఇనార్బిట్‌ మాల్‌లోని లైఫ్‌స్టైల్‌ స్టోర్‌లో ఉద్యోగం చేస్తున్నారు.

ఈ నెల 16న మధ్యాహ్నం ఆమె తన సహోద్యోగి పూజా అశోక్‌ అలోన్‌తో కలిసి ఐటీసీ కోహినూర్‌ సమీపంలో భోజనానికి వెళ్లారు.

భోజనం అనంతరం మధ్యాహ్నం 3గంటల సమయంలో ఇద్దరూ తిరిగి ఇనార్బిట్‌ మాల్‌కు వస్తున్నారు.

ఈ క్రమంలో జీబ్రా క్రాసింగ్‌పై రోడ్డు దాటుతుండగా టీజీ 09 జీ 0666నంబర్‌ గల ఆస్టన్‌ మార్టిన్‌ స్పోర్ట్స్‌ కారు వేగంగా వచ్చి భారతి ముఖిని బలంగా ఢీకొట్టింది.

కారు ఢీకొన్న వేగానికి భారతి గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడిపోయారు.

ఈ ప్రమాదంలో ఆమె తలకు,శరీరంలోని ఇతర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి.

వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు.

వివరాలు 

నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా నడపడం వల్లే ప్రమాదం

ప్రమాదం అనంతరం సంజుష్‌ ఆస్పత్రికి వచ్చినప్పటికీ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.

లైఫ్‌స్టైల్‌ స్టోర్‌ మేనేజర్‌ పంజాల అశ్విన్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంజుష్‌ కారును నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా నడపడం వల్లే ప్రమాదం జరిగి భారతి మృతి చెందినట్లు పోలీసులు నిర్ధరించారు.

ఈ మేరకు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)లోని సెక్షన్‌ 106(1) కింద కేసు నమోదు చేశారు.

దర్యాప్తులో భాగంగా సంజుష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే అతనికి నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, డ్రగ్‌ పరీక్షల్లో నెగెటివ్‌ ఫలితాలు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో నోటీసులు ఇచ్చి అతడిని వదిలేశామని వెల్లడించారు.

ADVERTISEMENT