Pushpa 2: హైదరాబాద్‌లో 'పుష్ప 2' స్క్రీనింగ్‌లో తొక్కిసలాట.. మహిళ మృతి, కుమారుడికి గాయాలు
పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో కోసం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద బుధవారం రాత్రి 9.30 గంటలకు వచ్చిన అల్లు అర్జున్‌ను చూసేందుకు అభిమానులు తీవ్ర ఉత్సాహంతో ఎగబడటంతో తొక్కిసలాట ఏర్పడింది. ఈ క్రమంలో వారిని నియంత్రించేందుకు పోలీసులు లాఠీఛార్జి చేసినప్పుడు,రేవతి(35)అనే మహిళ, ఆమె కుమారుడు శ్రీతేజ(9) కిందపడిపోయి, జనం కాళ్ల మధ్య నలిగిపోయారు. ఈ ఘటనలో వారు తీవ్ర గాయాలతో స్పృహ తప్పగా, వెంటనే పోలీసులు వారిని పక్కకు తీసుకెళ్లి సీపీఆర్ నిర్వహించారు.
పోలీసులు కేసు నమోదు.. విచారణ
తక్షణం వారిని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ తల్లి మృతిచెందారు. కుమారుడు పరిస్థితి విషమంగా ఉండడంతో, అతనిని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పుష్ప-2 సినిమా చూసేందుకు కుటుంబం మొత్తంనలుగురు సభ్యులతో వచ్చింది, కానీ తొక్కిసలాటలో తల్లి, కుమారుడు చిక్కుకున్నారు. ఆ కుటుంబంలో తల్లి మరణం విషాదాన్ని నింపింది.. ఈ ఘటనలో మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు.