
Rajasthan: రాజస్ధాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది భక్తుల మృతి
ఈ వార్తాకథనం ఏంటి
రాజస్థాన్‌లో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఖాటు శ్యామ్ ఆలయంలో దర్శనం ముగించుకుని ఇంటి బాట పట్టిన భక్తుల వాహనం ప్రమాదానికి గురై ఏడుగురు చిన్నారులు సహా మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక సంఘటన దౌసా జిల్లాలోని బాపి సమీపంలో మనోహర్‌పూర్ హైవేపై జరిగింది. వివరాల ప్రకారం,భక్తులతో వెళ్తున్న ఒక ప్యాసింజర్ పికప్ వాహనాన్ని ఎదురుగా వస్తున్న ట్రక్కు అధిక వేగంతో ఢీకొట్టింది. ఢీకొట్టిన ధాటికి పికప్ వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అత్యవసర సహాయక సిబ్బంది అక్కడికి చేరుకుని రక్షణ చర్యలు ప్రారంభించారు. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందారని అధికారులు నిర్ధారించారు.
వివరాలు
పలువురికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు
ఈ విషాదంపై దౌసా జిల్లా కలెక్టర్ దేవేంద్ర కుమార్ స్పందిస్తూ.."మొత్తం 11 మంది మరణించినట్లు ప్రాథమిక సమాచారం అందింది. తీవ్రంగా గాయపడిన 9 మందిని మెరుగైన చికిత్స కోసం ఇతర ఆసుపత్రులకు తరలించాం.మరో ముగ్గురికి జిల్లా ఆసుపత్రిలోనే వైద్యం అందిస్తున్నాం" అని వివరించారు. బాధితులంతా ఖాటు శ్యామ్ ఆలయ భక్తులేనని జిల్లా ఎస్పీ సాగర్ రాణా తెలిపారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని జైపూర్‌లోని ఎస్ఎంఎస్ ఆసుపత్రికి తరలించామని చెప్పారు. దైవదర్శనం ముగించుకుని ఆనందంగా ఇళ్లకు తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన సంభవించడంతో బాధిత కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు.