విశాఖలో అర్థరాత్రి కారు బీభత్సం.. మద్యం మత్తులో కారు నడిపిన వైద్యురాలు
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో మంగళవారం అర్థరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ మేరకు నగరంలోని ఓ మహిళా డాక్టర్ మద్యం మత్తులో కారును నడిపి ప్రమాదానికి కారణమయ్యారు. మితిమీరిన వేగంతో కారు నడపడంతో రోడ్డు పక్కన నిలుపుదల చేసిన బైక్‌లను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన తర్వాత వైద్యురాలు మరో కారులో ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. నగరంలోని రామా టాకీస్ నుంచి సిరిపురం వెళ్తున్న ఇన్నోవా కారు VIP రోడ్డులో గల ప్యారడైజ్ హోటల్ సమీపంలో అదుపుతప్పింది. దీంతో పార్కింగ్ లో నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది.
అదృష్టవశాత్తు భారీగా తప్పిన ప్రాణ నష్టం
ఈ క్రమంలో స్పీడ్ కంట్రోల్ కాక కారు వేగంగా డివైడర్ పైకి ఎక్కేసింది. దీంతో చెట్టును బలంగా ఢీకొని ఆగిపోయింది. ఘటనలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. ప్రమాద ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాణాలు నిలపాల్సిన వైద్యురాలే మద్యం మత్తులో వాహనాన్ని అతివేగంగా నడపడంపై నగరంలో జోరుగా చర్చ నడుస్తోంది. ఒకవేళ ప్రమాద సమయంలో అక్కడ వాహనదారులు ఉండి ఉంటే భారీ ప్రాణనష్టం సంభవించేదని స్థానికులు చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.