AP : మదనపల్లి మార్కెట్లో టమాటా రికార్డు ధరలు.. కిలో టమాటా రూ.224
భారీ వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా టమాటా ధర సామాన్యులకు అంతనంత ఎత్తులో దూసుకెళ్తోంది. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ మేరకు పలు కూరగాయల మార్కెట్‌ల్లో రికార్డు స్థాయిలో కిలో టమాటా రూ.200పైనే పలుకుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా మదనపల్లె టమాటా మార్కెట్‌లో టామాటోలు కొత్త రికార్డు సృష్టించాయి. మదనపల్లె నియోజకవర్గంలోని అంగళ్లు మార్కెట్‌లో మంగళవారం నాణ్యమైన టమాటా ధర చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో కిలో ధర రూ.224 పలికింది. మంగళవారం మార్కెట్లోకి సుమారుగా 10 వేల క్రేట్ల సరకు వచ్చింది. వేలంలో ఒక్క క్రేటు ధర రూ. 5,600లకు అమ్ముడైనట్లు టీవీఎస్ మండీ యజమాని బాబు, మేనేజర్ షామీర్ వెల్లడించారు.
రూ.200 నుంచి రూ.224కి చేరిన టమాటాలు
గత 2, 3 రోజుల కిందట రూ. 200 ఉన్న కిలో టామాటా ఇప్పుడు ఏకంగా రూ. 224కి దూసుకెళ్లడంతో వ్యాపారులూ ఆశ్చర్యపోతున్నారు.మదనపల్లి మార్కెట్ నుంచే టమాటాను ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. అనంతపురం జిల్లా కక్కలపల్లి మార్కెట్‌లో 15 కిలోల బుట్ట రూ. 3,200కు విక్రయించారు. ఈ మేరకు కిలో ధర రూ. 215 పలికి మార్కెట్ చరిత్రలోనే అత్యధిక ధరగా నమోదైందని వ్యాపారులు చెబుతున్నారు. కనగానపల్లి మండలం పాతపాలెం రైతు బళ్లారి రాజు 90బుట్టల టమాటాలు నాణ్యత ఉండటంతో రూ. 3200 చొప్పున విక్రయించారు. ప్రస్తుతం టమాటా పేరు వింటేనే వినియోగదారులు ఆమాడ దూరం వెళ్తున్నారు. బదులుగా చాలామంది మాంసం(చికెన్) కొంటున్నారంటే ధరలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థమవుతోంది.