విశాఖపట్నం జిల్లాలో ఘోరం.. బంగారం కోసం యజమాని తల్లిని హత్య చేసిన వాలంటీర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఘోర ఘటన కలకలం రేపింది. విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తిలో విధులు నిర్వహస్తున్న ఓ వాలంటీర్ బంగారు గొలుసు కోసం యజమాని తల్లిని హత్య చేశాడు. సుజాత నగర్ పరిధిలోని 95వ వార్డు సచివాలయంలో వెంకటేష్ అనే యువకుడు వాలంటీర్ గా పనిచేస్తూనే వరలక్ష్మి కుమారుడికి చెందిన ఓ ఫుడ్ కోర్టులో (హోటల్) వెంకటేష్ పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే సదరు హోటల్ ను మూసివేసి షాఫు తాళాలు వృద్ధురాలికి అప్పగించేందుకు రాత్రి పది గంటలకు యజమాని నివాసానికి చేరుకున్నాడు. ఇంట్లోకి వెళ్లాక ఒంటరి వృద్ధురాలి మెడలోని బంగారం కోసం ఆశపడ్డాడు.
సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు వెంకటేష్ ను గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసులు
ఈ నేపథ్యంలో వృద్ధురాలి మెడలో గొలుసు లాగుతుండగా జరిగిన పెనుగులాటలో ఆమెను గొంతు నులిమి హతమార్చాడు. కాసేపటి తర్వాత ఎప్పటిలాగే ఇంటికి వచ్చిన మృతురాలి కుమారుడు, తల్లిని విగతజీవిగా చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఈ మేరకు హుటాహుటిన పోలీసులకు సమాచారం అందించారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రాథమికంగా దర్యాప్తు ప్రారంభించారు. యజమాని నివాస ప్రాంగణంలోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు వెంకటేష్ ను గుర్తించారు. అనంతరం అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వెంకటేష్, ఈ ఘోర ఘటనకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు ప్రకటించారు.