మణిపూర్‌లో హింసను అరికట్టాలని అమిత్ షా ఇంటి ఎదుట 'కుకీ' తెగ మహిళల నిరసన
మణిపూర్‌లో జాతి హింసను అరికట్టాలని ప్లకార్డులతో కుకీ తెగకు చెందిన మహిళలు బుధవారం దిల్లీలోని కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాసం వెలుపల నిరసన తెలిపారు. శాంతి పునరుద్ధరిస్తానని ఆయన హామీ ఇచ్చినప్పటికీ, మణిపూర్‌లో తమ తెగపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయని మహిళలు చెప్పారు. తమ జీవితాలు జీవితాలు ప్రమాదంలో ఉన్నాయని స్పష్టం చేశారు. హోం మంత్రి, ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమే తమకు సాయం చేయగలరని కుకీ తెగకు చెందిన మహిళలు చెప్పారు. మణిపూర్‌లో మంగళవారం తెల్లవారుజామున భద్రతా బలగాలు, తిరుగుబాటుదారుల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక భద్రతా సిబ్బంది మరణించగా, మరో ఇద్దరు గాయపడినట్లు సైన్యం తెలిపింది.
మణిపూర్ అల్లర్ల వల్ల 35,000 మంది నిరాశ్రయులు
మణిపూర్‌లో పరిస్థితులు కొన్ని వారాలుగా ఉద్రిక్తంగా మారాయి. అల్లర్లు, జాతి ఘర్షణల్లో 80మంది చనిపోయారు. 35,000 మంది నిరాశ్రయులయ్యారు. భద్రతా బలగాలు భారీ అణిచివేతతో గత నెలలో 30 మందికి పైగా తిరుగుబాటుదారులు మరణించారు. జూన్ 6న రాత్రి జరిగిన భద్రతా బలగాలు, తిరుగుబాటుదారుల మధ్య స్వల్పంగా కాల్పులు జరిగాయని భారత సైన్యం ట్విట్టర్‌లో పేర్కొంది. గిరిజన సమూహంలో మెజార్టీ కమ్యూనిటీ అయిన మైతీ తెగకు ఎస్టీ హోదా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ ప్రాంతంలో జాతి హింస మొదలైంది. మణిపూర్‌లో శాంతి, శ్రేయస్సుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి కార్యకలాపాలు జరిగినా కఠినంగా వ్యవహరించాలని భద్రతా బలగాలకు హోంమంత్రి అమిత్ షా సూచించారు.