Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ.. కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం సోమవారం ఆమోద ముద్రవేసింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా మోదీ ప్రభుత్వం ఈ చారిత్రక నిర్ణయంతీసుకోవడం గమనార్హం. మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం లేదా మూడింట ఒక వంతు రిజర్వేషన్లను కల్పిస్తుంది. అదనంగా, 33 శాతం కోటాలో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు), ఆంగ్లో-ఇండియన్లకు ఉప-రిజర్వేషన్లను బిల్లు సూచిస్తుంది. ప్రతి సార్వత్రిక ఎన్నికల తర్వాత రిజర్వ్‌డ్ సీట్లను మార్చాలని ఈ బిల్లు ప్రతిపాదించింది.
సెప్టెంబర్ 20న బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం
మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపినట్లు కేంద్ర సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ట్వీట్ చేశారు. మహిళల రిజర్వేషన్ల డిమాండ్‌ను నెరవేర్చే నైతిక ధైర్యం మోదీ ప్రభుత్వానికి మాత్రమే ఉందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును సెప్టెంబర్ 20, బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒకరోజు తర్వాత దిల్లీ లేదా రాజస్థాన్‌లో మహిళలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించే అవకాశం ఉంది. అయితే ఈ ప్రోగ్రాం గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడంపై దిల్లీ పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది మహిళలు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపేందుకు తరలివచ్చారు.