Amaravati: ఏకధాటిగా 15 వేల క్యూబిక్ మీటర్ల రాఫ్ట్ ఫౌండేషన్ పనులు ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయుడు పర్యవేక్షణలో అమరావతిని నిర్ణీత గడువులో ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని మంత్రి పి. నారాయణ స్పష్టం చేశారు. అమరావతిలో శరవేగంగా సాగుతున్న హైకోర్టు నిర్మాణ పనుల్లో భాగంగా శుక్రవారం ఏకధాటిగా 15 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ఫౌండేషన్ (రాఫ్ట్) పనులను మంత్రి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏజీఐసీఎల్) ఎండీ శ్రీనివాస్‌తో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ, మొత్తం హైకోర్టు భవన నిర్మాణానికి 65 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌ను వినియోగిస్తున్నామని తెలిపారు.
Details
15 వేల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తి
అందులో ఇప్పటికే 15 వేల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. బేస్‌మెంట్ + గ్రౌండ్ + 8 అంతస్తులతో 50.4 మీటర్ల ఎత్తులో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా హైకోర్టు భవనాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. 2027 డిసెంబరు నాటికి హైకోర్టు నిర్మాణాన్ని పూర్తిచేయాలనే లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయని వివరించారు. అదేవిధంగా రాజధానిలో అధికారులు, ఉద్యోగుల కోసం మొత్తం 4,026 ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. వాటిలో 3,500 ఇళ్ల నిర్మాణాన్ని ఈ ఏడాది మార్చి నెలాఖరుకు పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు.