270 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే అతిపెద్ద విరాట్ ఆలయ నిర్మాణం ప్రారంభం
ప్రపంచంలోనే అతిపెద్ద విరాట్ రామాయణ మందిరం బీహార్ లో నిర్మితం కానుంది. ఈ మేరకు రాష్ట్రంలోని తూర్పు చంపారణ్ జిల్లా, కల్యాణ్‌పూర్ మండలం ( బ్లాక్ ), కైథవలియా గ్రామంలో మంగళవారం భూమి పూజ జరిగింది. అనంతరం ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 2025 నాటికి ఆలయం అందుబాటులోకి వస్తుందని మహావీర్ మందిర్ న్యాస్ సమితి వెల్లడించింది. మంగళవారం ఉదయం 11 గంటలకు మొదలైన పూజా కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూసేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలన్నీ జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగాయి. 125 ఎకరాల భారీ విస్తీర్ణంలో విరాట్ రామాయణ దేవాలయం రూపుదిద్దుకుంటోంది. అయోధ్య మాదిరిగానే ఆలయ నిర్మాణం భక్తులను ఆకట్టుకుంటుందని సమితి చీఫ్ ఆచార్య కిశోర్ కునాల్ తెలిపారు.
ఏకంగా 270 అడుగుల ఎత్తుతో విరాట్ రామాయణ ఆలయం
అంగ్‌కోర్ వాట్ ఆలయం 215 అడుగుల ఎత్తు ఉండగా, విరాట్ రామాయణ ఆలయం ఏకంగా 270 అడుగుల ఎత్తుతో నిర్మాణం కానుంది. 2012లోనే ఈ ఆలయ నిర్మాణానికి అడుగులు పడ్డా, అంగ్‌కోర్ వాట్‌ను పోలినట్లు నిర్మాణ ప్లాన్ గీయడంపై కంబోడియా అభ్యంతరం తెలిపింది. అనంతరం ఇరు దేశాల మధ్య చర్చలు సఫలం కావడంతో నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగాన్ని ఈ ఆలయ కాంప్లెక్సుల్లో నిర్మిస్తున్నారు. శివాలయం ఎదురుగా దాదాపుగా 33 అడుగుల ఎత్తు, 33 అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు మహాబలిపురంలో గ్రానైట్‌తో ఈ లింగం ప్రాణం పోసుకుంటోంది. 1,008 శివలింగాలను ఒకే లింగంలోకి పేర్చి దీన్ని తయారు చేస్తుండటంతో ప్రత్యేకత సంతరించుకుంటోంది.