
Revelations Biotech: తెలంగాణకు మరో భారీ పరిశ్రమ.. రివిలేషన్స్ బయోటెక్ ఆధ్వర్యంలో యూనిట్ నిర్మాణం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ పారిశ్రామిక రంగంలో మరో ప్రధాన ముందడుగు పడింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రక్టో-ఒలిగో శాకరాయిడ్స్ (FOS) ఉత్పత్తి యూనిట్‌ను నిజామాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నారు. రివిలేషన్స్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో నిజామాబాద్ మెగా ఫుడ్ పార్క్‌లో ఈ భారీ పరిశ్రమ నిర్మాణంలో ఉంది. ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత భారతదేశంలోని బయోటెక్నాలజీ,ఆహార ప్రాసెసింగ్ రంగాలు మరింత బలోపేతం అవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ యూనిట్‌ను సంవత్సరానికి 20,000 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించగా, 2027 ఆగస్టులో పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభించే ప్రణాళిక ఉంది. దీని ద్వారా ప్రత్యక్షంగా 200 మందికి, పరోక్షంగా 500 మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడతాయి.
వివరాలు
నిజామాబాదే ఎందుకు?
ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (BIRAC) ఆర్థిక సహాయం అందించగా,తెలంగాణ ప్రభుత్వం కూడా అవసరమైన మద్దతు అందిస్తోంది. ఇప్పటికే రివిలేషన్స్ బయోటెక్,BIRAC మధ్య ఒప్పందం కుదిరింది. FOS ఉత్పత్తికి ప్రధాన ముడిపదార్థం చక్కెర. తెలంగాణలో నిజామాబాద్ ప్రాంతం చెరుకు సాగు, చక్కెర ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక చెరుకు రైతులకు దీర్ఘకాలికంగా లాభం చేకూరుతుందని, వారికి స్థిరమైన మార్కెట్ సౌకర్యం లభిస్తుందని కంపెనీ ప్రతినిధి వివరించారు. అలాగే, దేశంలో పెరుగుతున్న మధుమేహ సమస్యను దృష్టిలో ఉంచుకుని, చక్కెరకి బదులుగా ఆరోగ్యకరమైన FOS ఒక మంచి పరిష్కారమని ఆయన తెలిపారు.
వివరాలు
'మేక్ ఇన్ ఇండియా'కు ప్రోత్సాహం
FOS సహజసిద్ధమైన ప్రీబయాటిక్‌గా పనిచేస్తుంది. ఇది జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి మేలు చేస్తుందని శాస్త్రీయంగా నిరూపితమైంది. న్యూట్రాస్యూటికల్స్, ఫంక్షనల్ బేవరేజెస్ వంటి ఉత్పత్తుల్లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. రివిలేషన్స్ బయోటెక్ సంస్థ ఈ FOSను తమ ప్రత్యేక, పర్యావరణహిత టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేయనుంది. ఇప్పటికే "స్వీట్ స్పాట్" బ్రాండ్ పేరుతో FOS రిటైల్ మార్కెట్లో విక్రయించడం ప్రారంభించింది. కంపెనీ ప్రతినిధుల ప్రకటన ప్రకారం,ఈ యూనిట్ భారత బయోటెక్నాలజీ రంగంలో చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుంది. "ఈ ప్రాజెక్టు 'Make in India' లక్ష్యానికి అనుగుణంగా ఉంది. దీని ద్వారా దిగుమతులపై ఆధారపడటం తగ్గిపోతుంది, భవిష్యత్తులో భారత్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద FOS ఎగుమతిదారుగా నిలిపే లక్ష్యం మా ప్రణాళికలో ఉంది" అని ఆయన పేర్కొన్నారు.