
Pahalgam: పహల్గాం దాడిపై ఇంటెలిజెన్స్ ముందస్తు హెచ్చరికలున్నా.. చర్యలలో విఫలమయ్యారా?
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి అధికారులు ముందుగా దీనిపై హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, దానిని అడ్డుకోవడంలో విఫలమైనారా? అనే సందేహాలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి.
మార్చి 10న జమ్మూలో కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఆ సమావేశం జరిగిన కొద్ది రోజుల్లోనే,ఏప్రిల్ 6న కేంద్ర హోం మంత్రి స్వయంగా జమ్ముకశ్మీర్ యూనిఫైడ్ కమాండ్‌తో సమావేశమయ్యారు.
ఈ రెండు వేర్వేరు సమీక్షలు జరిగినా,వీటి లక్ష్యం ఒక్కటే.. జమ్మూకశ్మీర్‌లో పాకిస్థాన్ భారీ విధ్వంసక చర్యలకు యత్నిస్తున్నదని ముందుగానే హెచ్చరించడం.
జమ్మూకశ్మీర్‌లో భద్రతా వ్యవస్థను ముఖ్యమంత్రి నేతృత్వంలోని యూనిఫైడ్ కమాండ్ పర్యవేక్షిస్తుంది.
అయితే,"మినీ స్విట్జర్లాండ్"గాపేరొందిన పర్యాటక ప్రదేశం అయిన పహల్గాం ఇప్పుడు ఉగ్రవాదుల దృష్టిలో పడినట్టు అనిపిస్తోంది.
వివరాలు
స్థానికులు కూడా భాగమా..?
ఈ దాడిలో కనీసం నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉగ్రవాదులు పాల్గొన్నారని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి.
ఇందులో ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు ఉన్నట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ఈ ఇద్దరూ బిజ్‌బెహ్రా, త్రాల్ ప్రాంతాలకు చెందిన వారై ఉండవచ్చు.
వీరిలో ఒకరు బాడీ కెమెరా ధరించి ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
మిగిలిన ఇద్దరు పష్తూన్ భాషలో మాట్లాడటం వల్ల, వారు పాకిస్థాన్ సిటిజన్లు కావచ్చని భావిస్తున్నారు.
వివరాలు
జమ్ముకశ్మీర్‌లో విదేశీ ఉగ్రవాదుల సంఖ్య 70కి పైగా!
ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం,ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో సుమారు 70 మంది విదేశీ ఉగ్రవాదులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే వారు సరిహద్దులను దాటి దేశంలోకి ప్రవేశించి, తగిన ఆదేశాల కోసం సామాన్య పౌరుల వేషధారణలో సంచరిస్తున్నారు.
ముఖ్యంగా శీతాకాలం ముగియడంతో మంచు కరిగిపోవడం వల్ల, ఈ ఉగ్రవాదులు పర్వత ప్రాంతాల నుండి బైసరన్ లోయ వైపు దాడికి దిగినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టి గాలింపు చర్యలు చేపట్టాయి.
వివరాలు
దాడికి ముందే లష్కరే హెచ్చరికలు!
పహల్గాం ఘటనకు కొద్దిరోజుల ముందు, పాకిస్థాన్‌కు చెందిన ఉగ్ర సంస్థ లష్కరే తయిబా కమాండర్ ఒకరు కశ్మీర్‌లో రక్తపాతం సృష్టించాలంటూ పిలుపునిచ్చాడు.
ఏప్రిల్ 18న పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని రావల్కోట్ ప్రాంతంలోని కహిగల్ లో జరిగిన ఓ సభలో లష్కరే ఉగ్రవాది అబు ముసా ఈ వ్యాఖ్యలు చేశాడు.
అతను భారత సైనిక దళాలకు సవాలు విసిరాడు. అంతేకాకుండా అతడు జమ్మూకశ్మీర్ యునైటెడ్ మూవ్‌మెంట్‌కు నేతగా వ్యవహరిస్తున్నాడు కూడా.