వైసీపీకి యార్లగడ్డ వెంకట్రావు బైబై.. జగన్‌ను అసెంబ్లీలోనే కలుస్తానని జోస్యం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడి రాజుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ నేతలు పార్టీలు మారుతున్నారు. ఈ మేరకు ఆయా అధిష్టానాలకు షాకులు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే గన్నవరం వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఈ మేరకు ప్రతిపక్ష తెలుగుదేశంలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు అపాయింట్ అడిగినట్లు యార్లగడ్డ ప్రకటించారు. గన్నవరం అభ్యర్థిగా టిక్కెట్ ఇవ్వాలని భావిస్తే పోటీకి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. విజయవాడలో తన అనుచరులతో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో గన్నవరంలో టిడిపి టిక్కెట్ ఇస్తే ఎమ్మెల్యేగా గెలిచి కానుకగా ఇస్తానన్నారు. ఈ క్రమంలోనే జగన్‌ను అసెంబ్లీలోనే కలుస్తానని జోస్యం చెప్పారు.
అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా, టిక్కెట్ లేదన్న సీఎం జగన్‌కు ధన్యవాదాలు : యార్లగడ్డ
గత ఎన్నికల్లో గన్నవరంలో ఓడినా కార్యకర్తలు తనతోనే ఉన్నారని, తనతో ఉన్నవారికి పదవులు ఇవ్వలేదని వైసీపీ మీద గుర్రుగా ఉన్నారన్నారు. రెండు రోజుల కిందట సజ్జలను కలిశానన్నారు. టిక్కెట్ అడిగితే ఉండాలనుకుంటే ఉండు లేకుంటే లేదని అన్నట్లు వెంకట్రావు చెప్పారు. టిడిపికి కంచుకోట లాంటి గన్నవరంలో వైసీపీ కోసం కష్టపడ్డానన్నారు. తనకు 2005లోనే అమెరికా గ్రీన్ కార్డు వచ్చిందని, రాజకీయాలపై ఆసక్తితోనే తిరిగి గన్నవరం వచ్చానన్నారు. టిక్కెట్ కోసం ఇప్పటివరకు చంద్రబాబు, లోకేశ్, దేవినేనిని తాను కలవలేదన్నారు. తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వని, శాసనసభకు పార్టీ టిక్కెట్ లేదని చెప్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు యార్లగడ్డ చెప్పారు.