చిక్కుల్లో నటుడు పోసాని.. పరువు నష్టం దావా వేసిన లోకేశ్
తెలుగు సినీనటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళీ వివాదంలో చిక్కుకున్నారు. ఏపీలోని మంగళగిరి కోర్టులో పరువు నష్టం కేసును ఎదుర్కొనున్నారు. ఈ మేరకు పోసానితో పాటు సింగలూరు శాంతిప్రసాద్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే పాదయాత్రకు స్వల్ప విరామం ప్రకటించిన లోకేశ్ ఇవాళ మంగళగిరి కోర్టును ఆశ్రయించారు. తనపై వారిద్దరూ తప్పుడు ఆరోపణలు చేశారని లోకేశ్ పిటిషన్ లో వివరించారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు, తమపై నిరాధార ఆరోపణలు చేశారని లోకేశ్ తెలిపారు. సింగలూరు శాంతి ప్రసాద్, పోసాని కృష్ణ మురళిలపై లోకేశ్ వేర్వేరుగా పరువు నష్టం దావా వేశారు. కేసుల్లో భాగంగా వాంగ్మూలం నమోదు ఇచ్చేందుకు లోకేశ్ మంగళగిరి కోర్టుకి చేరుకున్నారు.
14 ఎకరాలు కొన్నట్లు నిరాధారమైన ఆరోపణలు చేశారు: లోకేశ్
ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా పనిచేస్తున్న పోసాని,ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వూలో కంతేరులో లోకేశ్ 14 ఎకరాల భూములను కొనుగోలు చేసినట్లు ఆరోపణలు గుప్పించారు. అరసెంటు భూమి లేని తనకు 14 ఎకరాలున్నట్లు తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డ లోకేశ్, తనకు సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు లాయర్ తో నోటీసులు పంపించారు. 2 సార్లు నోటీసులు ఇచ్చినా పోసాని స్పందించకపోవడంతోనే పరువు నష్టం దావా వేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల నుంచి వసూళ్లు చేయిస్తున్నట్లు ఆరోపించిన సింగలూరుకూ లాయర్ నోటీసులు పంపారు. తనకు సారీ చెప్పాలని నోటీసుల్లో లోకేశ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే నిరాధారమైన ఆరోపణలు చేసిన ఆ ఇద్దరిపై లోకేశ్ చర్యలకు నడుం బిగించారు.