Heavy Rains: హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్.. రానున్న నాలుగు రోజుల్లో భారీ వర్షాలు
తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాల కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక హైదరాబాద్‌కి ఎల్లో అలర్ట్ ప్రకటించారు. సెప్టెంబర్ 23 నుంచి 25 వరకు నగరంతో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ముఖ్యంగా మంగళవారంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నగరవాసులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. హైదరాబాద్‌లో ఆదివారం కూడా భారీ వర్షాలు కురిసాయి. గోల్కొండలో 91.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం నమోదు
యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 103.3 మి.మీ వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో ఈ ఏడాది సాధారణ వర్షపాతం కన్నా 31 శాతం అధికంగా నమోదైంది. హైదరాబాద్‌లో కూడా సాధారణం కంటే 36 శాతం అధికంగా 780.4 మి.మీ వర్షపాతం ఎక్కువగా కురిసింది. కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.