Skill University: తెలంగాణలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ.. 6 వేల మందికి నైపుణ్య శిక్షణ
తెలంగాణ ప్రభుత్వం అత్యాధునిక హంగులతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని నిర్మించేందుకు ముందుకొచ్చింది. ఈ యూనివర్సిటీ రంగారెడ్డి జిల్లా, కందుకూరు మండలం మీర్ ఖాన్ పేట సమీపంలో 57 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానుంది. యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, అకడమిక్ బ్లాక్, వర్క్ షాపులు, బాలికలు, బాలురకు వేర్వేరుగా వసతిగృహాలు, డైనింగ్ హాల్, స్టాఫ్ క్వార్టర్స్, లైబ్రరీ, ఆడిటోరియం, పార్కింగ్ స్థలం, సువిశాల మైదానం ఉండేలా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. విద్యార్థుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, 6 వేల మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ, వసతుల కల్పన లక్ష్యంగా నిర్మాణాలు చేయనున్నారు. అన్ని భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి విద్యుత్ వినియోగం తగ్గించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. .
విరాళాలు అందించిన మేఘా, అదానీ కంపెనీలు
యూనివర్సిటీ నిర్మాణం కోసం మేఘా కంపెనీ రూ.200 కోట్లు, అదానీ కంపెనీ రూ.100 కోట్ల విరాళాలు అందించాయి. వివిధ కార్పొరేట్ కంపెనీలతో భాగస్వామ్యం, విరాళాల ద్వారా సమీకరించిన నిధులతో ప్రభుత్వ కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా యూనివర్సిటీ నిర్వహణలో భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. శంషాబాద్ విమానాశ్రయం, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి యూనివర్సిటీకి చేరుకునేందుకు 40 కి.మీ. సులభమైన రహదారి నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. రావిర్యాల ఎగ్జిట్ 13 నుంచి మీర్ ఖాన్ పేట మీదుగా ఆకుతోటపల్లి వద్ద రీజనల్ రింగ్ రోడ్‌కు అనుసంధానం చేసేలా ఈ రహదారిని 200 అడుగుల వెడల్పుతో నిర్మిస్తారు.