PM Modi: 'మీ ధైర్యం లక్షల మందికి స్పూర్తి'.. సునీతా బృందానికి ప్రధాని ప్రశంసలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) సుదీర్ఘ నిరీక్షణకు తెరదించి, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి భూమికి తిరిగి చేరుకున్నారు.
దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఆమె, బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సముద్ర జలాల్లో దిగారు.
వ్యోమగాములు సురక్షితంగా భూమిని చేరడంతో ప్రపంచవ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది. చాలా కాలం తర్వాత భూమికి వచ్చిన వీరికి యావత్ ప్రపంచం సాదరంగా స్వాగతం పలికింది.
Details
గర్వంగా ఉంది : మోదీ
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సునీతా విలియమ్స్ రాకపై స్పందించారు. సునీతా బృందానికి అభినందనలని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
వెల్ కమ్ బ్యాక్.. క్రూ-9..! భూమి మిమ్మల్ని మిస్ అయిందంటూ ఆయన వ్యాఖ్యానించారు.
మీ ధైర్యం, పట్టుదల ప్రపంచానికి స్పూర్తిదాయకమని, క్లిష్ట, అనిశ్చిత పరిస్థితుల్లో మీరు చూపిన సంకల్పం అభినందనీయమని ప్రధాని మోదీ కొనియాడారు.
లక్షలాది మంది యువతకు ప్రేరణగా నిలిచారని, అంతరిక్ష పరిశోధన అంటే మానవ సామర్థ్యాలను విస్తరించడం, కలలను నిజం చేసుకోవడమే అన్నారు.
ఒక మార్గదర్శకురాలిగా సునీతా విలియమ్స్ తన కెరీర్ అంతటా ఈ స్ఫూర్తిని ప్రదర్శించారని, భూమికి విజయవంతంగా తిరిగి రావడాన్ని గర్వంగా భావిస్తున్నామని మోదీ తెలిపారు.