LOADING...
YouTuber: న్యాయవ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు.. యూట్యూబర్‌కు 6 నెలల జైలు శిక్ష
న్యాయవ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు.. యూట్యూబర్‌కు 6 నెలల జైలు శిక్ష

YouTuber: న్యాయవ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు.. యూట్యూబర్‌కు 6 నెలల జైలు శిక్ష

వ్రాసిన వారు Sirish Praharaju
May 20, 2026
01:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ న్యాయవ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ గుల్షన్ పహూజాకు దిల్లీ హైకోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణ కేసులో దోషిగా తేలిన పహూజాపై రూ.2 వేల జరిమానా కూడా విధించింది. న్యాయవ్యవస్థను నియంతృత్వ పాలనతో పోలుస్తూ,కోర్టులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా పరిగణించిన హైకోర్టు.. గరిష్ఠ శిక్ష విధించింది. జస్టిస్ నవీన్ చావ్లా,జస్టిస్ రవీందర్ దుదేజాతో కూడిన ధర్మాసనం మే 16న ఈ తీర్పు వెలువరించింది. 'భారత న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం లేదని', 'కోర్టుల ఇష్టారాజ్యం పెరుగుతోందని', 'మన్మర్జీ అంటే నియంతృత్వమే' అంటూ పహూజా చేసిన వ్యాఖ్యలు న్యాయవ్యవస్థ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని కోర్టు పేర్కొంది.

వివరాలు 

న్యాయమూర్తులు,కోర్టులపై అభ్యంతరకర వ్యాఖ్యలు

తక్కువ శిక్ష విధిస్తే భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. గుల్షన్ పహూజా తన "Fight 4 Judicial Reforms"యూట్యూబ్ ఛానల్‌లో న్యాయవాదులు శివ్ నారాయణ్ శర్మ,దీపక్ సింగ్‌లతో ఇంటర్వ్యూలు నిర్వహించాడు. ఆ వీడియోల్లో న్యాయమూర్తులు,కోర్టులపై అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. ఈ వీడియోలను గమనించిన ముగ్గురు న్యాయాధికారులు ఢిల్లీ హైకోర్టుకు ఫిర్యాదు చేయడంతో కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ కేసులో న్యాయవాదులు శివ్ నారాయణ్ శర్మ, దీపక్ సింగ్‌లు కోర్టుకు నిర్భంద క్షమాపణలు తెలిపారు.

వివరాలు 

60 రోజుల పాటు శిక్ష అమలు నిలిపివేత 

తమ అనుమతి లేకుండానే వీడియోలు యూట్యూబ్‌లో పెట్టారని, థంబ్‌నెయిల్స్‌, బ్యానర్ల గురించి తెలియదని వివరణ ఇచ్చారు. వారి క్షమాపణలను నిజాయితీగా భావించిన కోర్టు.. వారిపై ధిక్కరణ కేసులను రద్దు చేసింది. అయితే గుల్షన్ పహూజా మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూనే ఉన్నాడు. తాను న్యాయ సంస్కరణల కోసం, కోర్టు విచారణల ఆడియో-వీడియో రికార్డింగ్ కోసం ప్రజా ప్రయోజన దృష్టితో మాట్లాడినట్టు వాదించాడు. అయితే కోర్టు అతని వాదనలను తిరస్కరించింది. విచారణ సమయంలో కూడా న్యాయవ్యవస్థపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనించిన ధర్మాసనం.. అతనిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని పేర్కొంది. కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ.. శిక్ష అమలును 60 రోజుల పాటు నిలిపివేసింది.

Advertisement