Page Loader
Y.S.Jagan: జనంలోకి మళ్లీ జగన్… మరోసారి పాదయాత్రతో ప్రజల ముందుకు!
జనంలోకి మళ్లీ జగన్… మరోసారి పాదయాత్రతో ప్రజల ముందుకు!

Y.S.Jagan: జనంలోకి మళ్లీ జగన్… మరోసారి పాదయాత్రతో ప్రజల ముందుకు!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 02, 2025
03:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

వై.ఎస్.జగన్ మరోసారి పాత ఫార్ములాతోనే ముందుకు రానున్నారు. 2019 ఎన్నికలకు ముందు "ప్రజాసంకల్ప యాత్ర" పేరుతో ఆయన చేపట్టిన పాదయాత్ర వైసీపీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. దాని ఫలితంగా ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 అసెంబ్లీ స్థానాలను గెలుచుకొని అధికారంలోకి వచ్చింది. ఐదేళ్లు పరిపాలన నిర్వహించిన తర్వాత, 2024 ఎన్నికలు పీడకలను మిగిల్చియానే చెప్పొచ్చు. ప్రస్తుతం విపక్షంలో ఉన్న వైసీపీ, తదుపరి ఎన్నికల కోసం ఇప్పుడే ప్రణాళికలు రచించడం మొదలుపెట్టింది.

వివరాలు 

మళ్లీ వైఎస్ జగన్ పాదయాత్ర… 

అధికారాన్ని కోల్పోయిన నేపథ్యంలో, పార్టీని మళ్లీ గట్టిగా నిలబెట్టేందుకు వైఎస్ జగన్ సన్నద్ధమవుతున్నారు. ఇటీవల ఆయన జిల్లాల వారీగా పార్టీ సమావేశాలు నిర్వహిస్తూ నాయకులకు మార్గదర్శకత్వం కల్పిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు మనదేనన్న నమ్మకాన్ని నాయకుల్లో నాటే ప్రయత్నం చేస్తున్నారు. తాజా పరిణామాల్లో భాగంగా, జగన్ యువజన విభాగానికి చెందిన నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మరోసారి పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. రాబోయే ఎన్నికల ముందు ప్రజల మధ్యకి నడుచుకుంటూ వెళ్లే ఉద్దేశం తనదని స్పష్టం చేశారు. దీంతో జగన్ మరోసారి పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకం కానున్న సంగతి పక్కా అయింది. ఆయన ఈ ప్రకటనను వైసీపీ శ్రేణులు హర్షోత్సాహాలతో స్వాగతించాయి.

వివరాలు 

మళ్లీ వైఎస్ జగన్ పాదయాత్ర… 

2017 నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయలో మొదలైన జగన్ పాదయాత్ర, రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ సాగింది. ఈ యాత్ర 2019 జనవరి 9న ముగిసింది. ఈ కాలంలో ఆయన వేలాది మందిని ప్రత్యక్షంగా కలుసుకుని, వారి సమస్యలు విన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి భరోసా ఇస్తూ సాగిన యాత్ర, ప్రజలతో బంధాన్ని పెంచింది. అదే ఆయనకు ఎన్నికల్లో ఘనవిజయాన్ని తీసుకొచ్చిన కారణాలలో ఒకటిగా నిలిచింది.

వివరాలు 

యూత్‌ను ఉత్తేజపరిచిన జగన్ 

యువజన విభాగ నేతలతో సమావేశంలో జగన్ మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల సమస్యలను పెద్దఎత్తున ముందుకు తెచ్చి, సామాజిక మాధ్యమాలను హేతుబద్ధంగా వాడాలన్నారు. ఎన్డీయే ప్రభుత్వ వైఫల్యాలను సమర్థవంతంగా ఎత్తిచూపాలన్నారు. ఈ సందర్భంగా వైసీపీ రాజకీయ ప్రస్థానాన్ని కూడా గుర్తు చేశారు. కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలతో పార్టీ ప్రారంభమైందని, 2010 తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో అఖండ ప్రజా మద్దతు లభించిందని చెప్పారు. 2014 ఎన్నికల తరువాత 67 మంది వైసీపీ ఎమ్మెల్యేలలో 23 మంది టీడీపీలోకి వెళ్లిపోయినప్పటికీ, మిగిలినవారు పోరాడుతూ పార్టీని నిలబెట్టారని వివరించారు.

వివరాలు 

యువత పాత్ర కీలకం అని స్పష్టమైన సందేశం 

"వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఎంతో చురుకుగా పనిచేస్తోంది. ప్రజావ్యతిరేక ప్రభుత్వాలను నిలదీయడంలో యువత కీలక భూమిక పోషించాలి. ఇప్పుడు పార్టీ నాయకత్వంలో ఎదగాలనుకునే యువతకు ఇది మంచి అవకాశం" అని జగన్ స్పష్టంగా సందేశమిచ్చారు.