Pinnelli Ramakrishna Reddy: ఈవీఎంల ధ్వంసం కేసులో పిన్నెల్లికి ఊహించని కష్టాలు !
విధ్వంసం, అరాచకానికి మారు పేరుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అడ్డంగా దొరికి పోయారు. అదీ ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో .. ఈ మేరకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మే 13న ఎన్నికల రోజు పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఓ ఈవీఎంను నేలకేసి కొట్టి ధ్వంసం చేశారు. అక్కడున్న వారిని బెదిరించి వెళ్లిపోవడం సీసీటీవీ ఫుటేజీలో చూడవచ్చు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వెబ్ కాస్టింగ్‌తో జరిగిన మేలు : దొరికిపోయిన నేత !
మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పీఎస్ నంబర్ 202తో పాటు 7 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ రోజున ఈవీఎంల ధ్వంసం జరిగింది. పీఎస్ నంబర్ 202 లో జరిగిన ఘటనలో సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెబ్ కెమెరాలో రికార్డ్ అయ్యారు. ఈవీఎంల ధ్వంసం ఘటనకు సంబంధించి కేసు దర్యాప్తులో సహకరించేందుకు పల్నాడు జిల్లా ఎన్నికల అధికారులు అన్ని పోలింగ్ స్టేషన్ల వీడియో ఫుటేజీని పోలీసులకు అందజేశారు. విచారణలో భాగంగా ఈవీఎం పగలగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే పేరును నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు.
నర్సరావు పేట లోక్ సభ స్ధానం పరిధిలో భారీగా విధ్వంసం
ఎన్నికల తదనంతం నర్సరావుపేట లోక్ సభ స్ధానం పరిధిలో భారీగా విధ్వంసం జరిగింది. దీని పరిధిలోకి మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం వస్తుంది . ఈ ఘటనల్లో పలువురు గాయపడ్డారు. చాలా చోట్ల ఆస్ధులకు నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఈ హింసకు స్ధానిక పోలీసులే బాధ్యులనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఎపి డిజిపి నియమించిన సిట్ విచారణ జరిపి సోమవారం ఆయనకు సమర్పించింది. ఇక ఎన్నికల సంఘం ఏ చర్యలకు సిఫార్సు చేస్తుందా అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.