Virosh: దేవతలా రష్మిక.. రాజులా విజయ్.. పెళ్లి నగలే హైలైట్
ఈ వార్తాకథనం ఏంటి
పాన్ ఇండియా స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి నిన్న (గురువారం) ఉదయ్‌పూర్‌లో అత్యంత ఘనంగా జరిగింది. ఉదయం 10.10 గంటల శుభముహూర్తంలో మూడు ముళ్లతో ఈ ఇద్దరూ దాంపత్య బంధంలోకి అడుగుపెట్టారు. ఉదయ్‌పూర్‌లోని ఐటీసీ మెమెంటోస్ హోటల్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహిత బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించారు. ఈ వివాహ వేడుకలో ముఖ్యంగా ఆకర్షణగా నిలిచింది వధూవరులు ధరించిన ఆభరణాలు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ నగల గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. హైదరాబాద్‌కు చెందిన 'శ్రీ జ్యువెలర్స్' సంస్థ ఈ పెళ్లి ఆభరణాలను రూపొందించింది. దాదాపు పది నెలల ముందుగానే ఈ నగల తయారీ పనులు ప్రారంభమయ్యాయి.
వివరాలు
భారతీయ సంప్రదాయం ప్రతిఫలించేలా ఆభరణాలు
శ్రీ జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్లు అభిషేక్ అగర్వాల్ మరియు కౌశిక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఆభరణాల తయారీలో కిలోల కొద్దీ బంగారాన్ని వినియోగించారు. విజయ్,రష్మిక ప్రస్తుత ఫ్యాషన్ ట్రెండ్‌లను అనుసరించకుండా, సాంప్రదాయ శైలినే ఎంచుకున్నారు. వారి అభిరుచికి అనుగుణంగా భారతీయ సంప్రదాయం ప్రతిఫలించేలా ఆభరణాలను రూపొందించారు.
వివరాలు
రాజవంశాల కాలం నాటి డిజైన్‌లే ప్రేరణ
ముఖ్యంగా రాజవంశాల కాలం నాటి డిజైన్‌లను ప్రేరణగా తీసుకుని నగలను తయారు చేశారు. రష్మిక మందన్న మొత్తం 11 రకాల ఆభరణాలు ధరించింది. వాటిలో మెడహారాలు, ఝుమ్కాలు, జడబిళ్ల, చంపసరాలు, మాతాపట్టి, ముక్కుపుడక, హత్‌పూల్, గాజులు, వంకీలు, వడ్డాణం, బాసికం ఉన్నాయి. విజయ్ దేవరకొండ ధరించిన నగలలో మెడహారాలు, చేతికడియాలు, వడ్డాణం, పెద్ద కమ్మలు, ఉంగరాలు, బాసికం ఉన్నాయి. ప్రతి ఆభరణంపైనా సుందరమైన నగిషీలు అద్భుతంగా చెక్కి ఉన్నాయి.