Valentine's Day: హైదరాబాద్ మహానగరం వెనుక అందమైన ప్రేమకథ.. వాలంటైన్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం
ఈ వార్తాకథనం ఏంటి
విశ్వనగరంగా, ఐటీ హబ్‌గా, హెరిటేజ్ సిటీగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌కు నాలుగు శతాబ్దాలకు పైగా విస్తరించిన గొప్ప చరిత్ర ఉంది. ఒకప్పుడు నిజాం రాజ్యానికి కేంద్రంగా, తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా, ప్రస్తుతం తెలంగాణ రాజధానిగా కొనసాగుతున్న ఈ మహానగరం ప్రపంచవ్యాప్తంగా పేరొందింది. అయితే ఈ నగర ఆవిర్భావం వెనుక దాగి ఉన్నది ఒక అపురూపమైన ప్రేమకథ. ప్రేమికులను కలిపేందుకు నిర్మించిన పురానాపూల్ వంతెన, ప్రియురాలికి కానుకగా వెలసిన హవామహల్ వంటి కట్టడాలు ఆ ప్రేమకు నిలువెత్తు నిదర్శనాలు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ కథను గుర్తు చేసుకుంటే, రోజూ చూసే హైదరాబాద్ నగరం మనకు కొత్తగా కనిపిస్తుంది.హైదరాబాద్ మహానగరం వెనుక అందమైన ప్రేమకథ
వివరాలు
భాగమతిని చూసి తొలిచూపులోనే మనసు పారేసుకున్న కులీ కుతుబ్‌షా
క్రీ.శ. 1590కు ముందు గోల్కొండే కుతుబ్‌షాహీ వంశానికి రాజధానిగా ఉండేది. ఆ కాలంలోనే యువరాజు కులీ కుతుబ్‌షా భాగమతిని చూసి తొలిచూపులోనే మనసు పారేసుకున్నాడు. భాగమతి నాట్యకళలో నిపుణురాలు. గోల్కొండకు సుమారు పది మైళ్ల దూరంలో ఉన్న చించల అనే చిన్న గ్రామంలో (నేటి శాలిబండ ప్రాంతం)ఆమె నివసించేది. ఆమెను కలుసుకోవడానికి కులీ కుతుబ్‌షా ప్రతిరోజూ మూసీ నదిని దాటి వెళ్లేవాడని కథనాలు చెబుతాయి. ఒకరోజు భాగమతిని కలుసుకోవడానికి వెళ్తుండగా మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. అయినా ప్రియురాలిని చూడాలనే తపనతో ఆయన సాహసం చేసి నదిని దాటాడు. ఈ విషయం తెలుసుకున్న భాగమతి తండ్రి కలత చెంది, ఇకపై అలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు వెంటనే ఒక వంతెన నిర్మించాలని ఆదేశించాడట.
వివరాలు
ప్రేమకు దారి వేసిన వంతెన 'ప్యార్ కా పూల్'.. పురానాపూల్
అలా 1578లో పురానాపూల్ వంతెన నిర్మితమైంది. ప్రేమకు దారి వేసిన ఈ వంతెనను చాలామంది ఇప్పటికీ 'ప్యార్ కా పూల్'గా పిలుస్తుంటారు. అదే సమయంలో గోల్కొండ రాజధానిగా ఉన్నప్పుడు తరచూ ఎదురవుతున్న నీటి సమస్యకు పరిష్కారం కనుగొనాలని కుతుబ్‌షాహీ వంశం భావించింది. నగరాన్ని కొత్త ప్రాంతానికి మార్చితే నీటి సమస్య తీరుతుందనే ఆలోచనతో మూసీ నది ఒడ్డున అనువైన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాంతాల అన్వేషణలో భాగంగానే యువరాజు కులీ కుతుబ్‌షా నది దాటి వచ్చి, అక్కడి చిన్న గ్రామంలో భాగమతిని చూసి ప్రేమలో పడ్డాడని చరిత్రకారులు చెబుతారు.
వివరాలు
భార్య పేరు మీద 'భాగ్యనగర్'
నగర నిర్మాణం కోసం వచ్చిన రాజకుమారుడు, ప్రేమ కారణంగానే అదే ప్రాంతాన్ని నగరంగా అభివృద్ధి చేశాడన్న మరో కథనమూ ప్రచారంలో ఉంది. అలా తన ప్రేమకు గుర్తుగా నిర్మించిన నగరానికి భార్య పేరు మీద 'భాగ్యనగర్' అని నామకరణం చేశాడట. కులీ కుతుబ్‌షాతో వివాహం అనంతరం భాగ్యమతి ఇస్లాం మతాన్ని స్వీకరించి 'హైదర్ మహల్'గా పేరు మార్చుకుంది. కాలక్రమేణా భాగ్యనగర్ పేరు హైదరాబాద్‌గా మారింది. ప్రేమతో మొదలైన ఆ కథే నేటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ నగరానికి పునాది అయింది.