ఆది మహోత్సవం: ప్రధాని మోదీ ప్రారంభించిన గిరిజనుల పండగ గురించి తెలుసుకోండి
గిరిజనుల సంప్రదాయాలను, కళలను, ఆహారాన్ని, వాణిజ్యాన్ని నగర ప్రజలు తెలుసుకోవడానికి ఆది మహోత్సవం పేరుతో ప్రతీ సంవత్సరం పండగ నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ఢిల్లీలో మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో ప్రధానమంత్రి మోదీ, స్వయంగా ఈ పండగను ప్రారంభించారు. ఆది మహోత్సవాన్ని ప్రారంభించడానికి ముందు గిరిజనుల హక్కుల కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముందాకు పూలమాలతో నివాళులర్పించారు ప్రధాని మోదీ. ఆ తర్వాత మోదీ మాట్లాడుతూ, దేశం నలుమూలల నుంచి వచ్చిన గిరిజనులను, గిరిజన కళాకారులను చూడడం ఎంతో సంతోషంగా ఉంది. మన దేశంలోని భిన్నత్వం మన దేశానికి అందం. అదే ఇప్పుడు మనల్ని అందరికంటే ఎత్తులో నిల్చోబెడుతుందని అన్నారు.
గిరిజన మంత్రిత్వ శాఖ మొదలు పెట్టిన ఆది మహోత్సవం
దేశం నలుమూలల్లో ఉండే గిరిజన కళాకారులు ఈ ఆది మహోత్సవంలో పాల్గొంటున్నారు. గిరిజన మంత్రిత్వ శాఖ చొరవ మేరకు ఆది మహోత్సవం కార్యక్రమం ప్రారంభమైంది. సుమారు వెయ్యి మంది కళాకారులు 200 స్టాల్స్ లో తాము చేసిన కళానైపుణ్యాలను జనాలకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అందమైన చీరలు, ఆకర్షించే నగలు, ఆహా అనిపించే ఆహారం, పెయింటింగ్స్ ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. హస్తకళలు, మట్టితో చేసిన కుండలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. గిరిజన సంస్కృతి గురించి తెలుసుకోవాలని, వాళ్ళ ఆహార అలవాట్లు రుచి చూడాలని మీకనిపిస్తే ఆది మహోత్సవం కార్యక్రమానికి ఫిబ్రవరి 16వ తేదీ నుండి 21వ తేదీ వరకు ఎప్పుడైనా వెళ్లవచ్చు. భారతదేశంలోని 28రాష్ట్రాలు, 8కేంద్రపాలిత ప్రాంతాల్లోని గిరిజనుల నైపుణ్యాలను ఇక్కడ మీరు చూడవచ్చు.