Loading...
Aiims Delhi: వైద్య రంగంలో భారత్‌ సరికొత్త చరిత్ర.. గర్భంలోనే శిశువుకు వెన్నెముక ఆపరేషన్‌..
వైద్య రంగంలో భారత్‌ సరికొత్త చరిత్ర.. గర్భంలోనే శిశువుకు వెన్నెముక ఆపరేషన్‌..

Aiims Delhi: వైద్య రంగంలో భారత్‌ సరికొత్త చరిత్ర.. గర్భంలోనే శిశువుకు వెన్నెముక ఆపరేషన్‌..

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 17, 2026
03:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత వైద్య రంగంలో మరో అరుదైన ఘనత నమోదైంది. తల్లి గర్భంలో ఉన్న శిశువుకు వెన్నెముక శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి దిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) వైద్యులు చరిత్ర సృష్టించారు. దేశంలోనే తొలిసారిగా 25 వారాల గర్భస్థ శిశువుకు ఈ తరహా ఆపరేషన్‌ చేశారు. శిశువు వెన్నెముకలో ఉన్న తీవ్రమైన లోపాన్ని 'ఓపెన్ ఫీటల్ సర్జరీ' విధానం ద్వారా విజయవంతంగా సరిచేశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌ న్యూరోసైన్సెస్‌ సెంటర్‌లో గురువారం ఈ క్లిష్టమైన శస్త్రచికిత్స జరిగింది. న్యూరోసర్జరీ విభాగానికి చెందిన డాక్టర్‌ దీపక్‌ గుప్తా నేతృత్వంలో 30మందికి పైగా వైద్య నిపుణులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. గైనకాలజీ, న్యూరోసర్జరీ,అనస్థీషియా, ప్లాస్టిక్‌ సర్జరీ తదితర విభాగాలకు చెందిన వైద్యులు,నర్సులు సమన్వయంతో పనిచేశారు.

వివరాలు 

ఈ సమస్య పిల్లల్లో శారీరక వైకల్యాలు వల్ల వచ్చే అవకాశం 

దాదాపు ఆరు గంటల పాటు శ్రమించి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.

వైద్య పరీక్షల్లో గర్భస్థ శిశువు 'లంబోసాక్రల్‌ మైలోమెనింగోసీల్‌' అనే అరుదైన జన్యుపరమైన నాడీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు.

ఈ లోపం కారణంగా శిశువు పుట్టిన తర్వాత పక్షవాతం, మెదడులో నీరు చేరడం వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.

సాధారణంగా ఈ సమస్య వల్ల పిల్లల్లో శారీరక వైకల్యాలు వచ్చే అవకాశముంది.

అయితే గర్భంలో ఉండగానే శస్త్రచికిత్స చేసి లోపాన్ని సరిచేయడం ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదాలను తగ్గించవచ్చని డాక్టర్‌ దీపక్‌ గుప్తా తెలిపారు.

వివరాలు 

తల్లి, గర్భంలోని శిశువు ఆరోగ్యం స్థిరంగా ఉందని వెల్లడి

ఈ అరుదైన ఆపరేషన్‌ను నిర్వహించేందుకు ఎయిమ్స్‌ వైద్య బృందం ఐదు వారాలకు పైగా ప్రత్యేకంగా సన్నాహాలు చేసింది.

శస్త్రచికిత్సకు అవసరమైన ఏర్పాట్లతో పాటు ఆధునిక ఇమేజింగ్‌ పరీక్షలు నిర్వహించింది.

ఆపరేషన్‌ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే మాక్‌ డ్రిల్స్‌ కూడా చేపట్టింది.

కేంద్ర ప్రభుత్వ జననీ శిశు సురక్ష కార్యక్రమం కింద ఈ శస్త్రచికిత్సను పూర్తిగా ఉచితంగా నిర్వహించారు.

ప్రస్తుతం తల్లి,గర్భంలోని శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

ఈ విజయాన్ని సాధించేందుకు ఎయిమ్స్‌ వైద్య బృందం గత 14ఏళ్లుగా కృషి చేస్తోందని సంస్థ యాజమాన్యం తెలిపింది.

గర్భస్థశిశువులకు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సలు నిర్వహించే సామర్థ్యంలో భారత వైద్య రంగం సాధించిన ఈ విజయం కీలక ముందడుగుగా నిలిచింది.

ADVERTISEMENT